Ram Gopal Varma :  రామ్ గోపాల్ వర్మ, ఊర్మిళా మటోండ్కర్ రహస్య వివాహం చేసుకున్నారంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం బాలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 1990లలో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రకరకాల ఊహాగానాలు రాగా, తాజాగా సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మళ్లీ తెరలేపాయి. సిద్ధార్థ్ కణ్ణాన్ యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన ఇంటర్వ్యూలో జ్యోతి వెంకటేష్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి తనకు ఈ రహస్య వివాహం గురించి చెప్పినట్లు వెల్లడించారు. ‘జెంటిల్‌మెన్’ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని కలిసినప్పుడు.. “రామ్ గోపాల్ వర్మ, ఊర్మిళ వివాహం గురించి జర్నలిస్ట్ అయిన నువ్వు ఎందుకు రాయలేదు?” అని చిరంజీవి తనను అడిగినట్లు ఆయన తెలిపారు.

ఈ వార్త విని ఆశ్చర్యపోయిన జ్యోతి వెంకటేష్ ఆధారాలు అడగగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ఆలయంలో వీరి వివాహం జరిగిందని, ఆ పూజారి ఫోన్ నంబర్ కూడా చిరంజీవి తనకు ఇచ్చారని తెలిపారు. అయితే ఈ వార్తను ప్రచురించే ముందు నిర్ధారణ కోసం ఊర్మిళకు ఫోన్ చేయగా, ఆమె ఏడ్చేశారని జ్యోతి వెంకటేష్ పేర్కొన్నారు. “ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు, నా గురించి ఇలా ఎలా రాయగలవు?” అని ఆమె అడిగినట్లు చెప్పారు. ఈ విషయంపై వివరణ కోరడానికి వర్మను సంప్రదించగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపారు.

రామ్ గోపాల్ వర్మ, ఊర్మిళ విడిపోవడానికి ప్రధాన కారణం కూడా జ్యోతి వెంకటేష్ వెల్లడించారు. ఊర్మిళ వర్మను లీగల్‌గా పెళ్లి చేసుకోవాలని కోరుకుందని, కానీ అప్పట్లో వర్మ ఆ నిర్ణయానికి సిద్ధంగా లేకపోవడం వల్లే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లు ఆయన తెలిపారు. 1990ల నుంచి 2000 ప్రారంభం వరకు ఈ జంట ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశారు. ‘రంగీలా’, ‘దౌడ్’, ‘సత్య’, ‘ప్యార్ టూనే క్యా కియా’ వంటి చిత్రాలు వీరిద్దరి కలయికలో వచ్చాయి. ఆ సమయంలో వీరిద్దరి మధ్య సంబంధం పనిని మించిపోయిందని, దీనివల్ల వర్మ అప్పటి భార్య రత్న వర్మతో వివాహ బంధం దెబ్బతిన్నదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కాగా, తన ఆటోబయోగ్రఫీ ‘గన్స్ అండ్ థైస్: ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ పుస్తకంలో ఊర్మిళపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని వర్మ బహిరంగంగానే పంచుకున్నారు. పుస్తకంలో ‘ఉమెన్ ఇన్ మై లైఫ్’ అనే ప్రత్యేక చాప్టర్‌ను ఊర్మిళకే అంకితం చేస్తూ.. ఆమె అందానికి తాను ఎంతగా ముగ్ధుడైంది అందులో రాసుకొచ్చారు. ఆ ఆకర్షణే తనను ‘రంగీలా’ చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకునేలా ప్రేరేపించిందని ఆయన తెలిపారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.