
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఇప్పటికే అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యనాయక్ జాదవ్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు చాలా వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా అశోక్‌నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో పోలీసులు సోదాలు నిర్వహించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఈ తనిఖీల్లో ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌తో పాటు ఒక కత్తిని, వేర్వేరు వ్యక్తుల చేతిరాతతో ఉన్న రెండు ప్రేమలేఖలను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖల ఆధారంగా ఆరా తీయగా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన మరో కొత్త కోణం బయటపడింది.
Also Read : తోటి టీచర్ల కుట్రలకు బలయ్యా… ఖమ్మం టీచర్ గౌతమి రిజైన్!
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. నిందితుడికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. సదరు మహిళకు 2014లోనే వివాహం కాగా, కుటుంబ సమస్యల కారణంగా 2023 నుంచి భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటోంది. ఈ సమయంలో ఆమెకు ఉదయ్ కృష్ణారెడ్డి పరిచయం కావడం, అది కాస్తా స్నేహంగా మారడం జరిగాయి. హైదరాబాద్‌కు వచ్చిన ఆ మహిళకు ఉదయ్ సూచన మేరకే అశోక్‌నగర్‌లోని ఒక ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగం దక్కినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిన తర్వాత లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండాలని నిందితుడు కోరినప్పటికీ, తనకు చట్టప్రకారం ఇంకా విడాకులు మంజూరు కాలేదనే కారణంతో ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.
అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో అశోక్‌నగర్‌లో ఉంటున్న ఆ మహిళను బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ స్వయంగా కలిశారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనతోనూ సన్నిహితంగా మెలుకుంటూనే మరోవైపు తనపై దాడి చేశాడని, తన విపరీత ప్రవర్తనతో తీవ్రంగా వేధిస్తున్నాడని ఆమె తన గోడును వెళ్లబోసుకున్నారు. ఆ బాధితురాలి ద్వారా అసలు విషయం తెలుసుకున్న సదరు మహిళ అప్పటి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డికి దూరంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే దాదాపు 20 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి నిందితుడు బలవంతంగా చొరబడి ఆమె ఫోన్ లాక్కున్నట్లు కూడా పక్కా ఆధారాలు సేకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి విపరీతమైన కోపం, అసాధారణ ప్రవర్తన కారణంగా శిక్షణ పొందుతున్న మరికొందరు కూడా తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు నిందితుడిని త్వరలోనే కస్టడీకి కోరేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read : ఈ ఏడాది భారీ అగ్నిప్రమాదాలు.. అందరూ పోతారు : భవిష్యవాణిలో సంచలనం..









