Gujarati Folk Singer Gopal Sadhu : నోట్ల వర్షంలో తడిసిముద్దయిన గాయకుడు.. గుజరాత్‌ ‘దైరో’ ఉత్సవంలో వైరల్‌ వీడియో!

Gujarati folk singer Gopal Sadhu : సంగీతానికి ఉన్న శక్తే వేరు. అది మనుషులను పరవశానికి గురి చేస్తుంది.. తన్మయత్వంలో ముంచెత్తుతుంది. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఒక సాంప్రదాయ జానపద ఉత్సవంలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక జానపద గాయకుడి గాత్రానికి ముగ్ధులైన అభిమానులు, గ్రామస్థులు ఏకంగా బస్తాల కొద్దీ కరెన్సీ నోట్లను ఆయనపై కుమ్మరించారు. ఎంతలా అంటే, సదరు గాయకుడు నోట్ల కుప్పల మధ్య పూర్తిగా మునిగిపోయినంతలా! ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by શ્રી મદ ભાગવત સપ્તાહ – ખંભાળીયા (@shreemat_bhagvat_saptah_)

Also Read :  ప్రయాణికులకు బిగ్ షాక్: పెరగనున్న బస్సు ఛార్జీలు.. అర్ధరాత్రి నుంచే అమలు!

ఖంభాలియాలో ‘దైరో’ సందడి

గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా ఖంభాలియా గ్రామంలో గుజరాతీ సాంప్రదాయ జానపద ప్రదర్శన అయిన ‘దైరో’ (Dayro) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ జానపద గాయకుడు(folk-singer) గోపాల్ సాధును గ్రామస్థులు ఆహ్వానించారు. వేదికపైకి చేరుకున్న ఆయన హార్మోనియం వాయిస్తూ, తన అద్భుతమైన గొంతుతో జానపద గీతాలను ఆలపించడం ప్రారంభించారు. గోపాల్ సాధు గాత్రం అక్కడి ప్రేక్షకులను ఊహాలోకాల్లో విహరింపజేసింది. ఆయన పాటలకు పరవశించిపోయిన అభిమానులు, స్థానికులు ఒక్కసారిగా స్టేజ్ మీదికి వచ్చి నోట్ల వర్షం కురిపించారు. జేబుల్లోంచి తీసి చల్లడం మాత్రమే కాదు.. ఏకంగా బస్తాల కొద్దీ కరెన్సీ నోట్లను తెచ్చి ఆయనపై పోశారు.

పాటలు సాగుతున్న కొద్దీ కరెన్సీ నోట్ల కుప్ప ఎంతగా పెరిగిపోయిందంటే.. గాయకుడు గోపాల్ సాధు అందులో పూర్తిగా కూరుకుపోయారు. కేవలం ఆయన తల మాత్రమే పైకి కనిపిస్తున్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా ఎంతో వృత్తి నైపుణ్యంతో, ఏమాత్రం చలించకుండా ఆయన తన పాటను కొనసాగించడం విశేషం. అక్కడ చేరిన ఒక ప్రేక్షకుడు ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో తీయగా, అనంతరం సదరు గాయకుడు స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో దీనిని పంచుకున్నారు.

ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో భిన్నమైన, ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు.”అసలైన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదేనేమో! కేవలం ఒకచోట కూర్చొని పాటలు పాడుతూ ఇలా నోట్ల వర్షంలో తడిసిపోవడం భలే ఉంది” అని ఒకరు చమత్కరించారు.”ఆ కరెన్సీ నోట్ల కుప్పల మధ్య మునిగిపోయి పాపం సింగర్ సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు” అని మరొకరు కామెంట్ చేశారు.

కేవలం వినోదంగానే కాకుండా కొందరు నెటిజన్లు దీనిపై సామాజిక కోణంలో స్పందించారు. “కళను గౌరవించడం మంచిదే.. కానీ ఆ కుప్పలుగా పోసిన డబ్బులో కొంతైనా స్థానిక నిరుపేదల సంక్షేమానికి, సేవా కార్యక్రమాలకు కేటాయిస్తే మరింత బాగుంటుంది” అని అభిప్రాయపడ్డారు.గుజరాత్‌లో ఇలాంటి సాంప్రదాయ ఉత్సవాల్లో కళాకారులపై డబ్బులు చల్లడం ఒక ఆనవాయితీగా వస్తున్నప్పటికీ.. ఈ స్థాయిలో ఒక గాయకుడు నోట్లలో మునిగిపోవడం మాత్రం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Also Read :  భర్తకు క్షయవ్యాధి, ముగ్గురు పిల్లలు : జాబ్ కోసమని వెళ్తే.. ఢిల్లీ సామూహిక అత్యాచార విస్తుపోయే నిజాలు!