HIV : తెలంగాణలో హెచ్‌‌ఐవీ వ్యాప్తిని ఆరికట్టడానికి ప్రజలలో అవగాహన పెంచేందుకు రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జాతీయ సంస్థ ఎన్ఏసీఓ భాగస్వామ్యంతో ఒక వినూత్న డిజిటల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఎవరికి వారు తమ హెచ్‌‌ఐవీ రిస్క్ స్థాయిని గోప్యంగా తెలుసుకునే వెసులుబాటును త్వరలో ప్రారంభించనుంది. ప్రజలు ఏమాత్రం భయం, సంకోచం లేకుండా తమ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత తెచ్చుకునేలా ఈ సేవను రూపొందించారు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆఫీసులు ప్రైవేట్ సంస్థల్లో ఈ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. మొబైల్ కెమెరాతో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా నేరుగా www.breakfreeindia.org వెబ్‌సైట్‌కి వెళ్లడం ద్వారా ఈ టెస్ట్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే లైంగిక ప్రవర్తన, సేఫ్టీ పద్ధతులు, సిరంజీల వినియోగం వంటి అంశాలపై 7 చాలా తేలికైన ప్రశ్నలు వస్తాయి. వాటికి అవును లేదా కాదు అని జవాబు ఇస్తే సరిపోతుంది.

మీరు ఇచ్చిన సమాధానాల ఆధారంగా హెచ్‌ఐవీ రిస్క్ తక్కువగా ఉందా, మధ్యస్థంగా ఉందా లేదా ఎక్కువగా ఉందా అనేది సిస్టమ్ వెంటనే చూపిస్తుంది. ఒకవేళ హెచ్‌ఐవీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటే, మీ లొకేషన్ ఆధారంగా సమీపంలోని ఐసీటీసీ టెస్టింగ్ సెంటర్లు, ఏఆర్‌టీ చికిత్స కేంద్రాల వివరాలను స్క్రీన్ పై చూపిస్తుంది. చాలామందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేసుకోవాలంటే భయం, సిగ్గు ఉంటాయి.

అందుకే ఈ సిస్టమ్‌లో మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి ఎలాంటి వ్యక్తిగత వివరాలూ నమోదు చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ పై వచ్చే సమాచారం కేవలం మీ వరకు మాత్రమే పరిమితమవుతుంది. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1.50 లక్షలకు పైగా హెచ్‌ఐవీ కేసులు ఉన్నాయి. హెచ్‌ఐవీపై సందేహాలు ఏమైనా ఉంటే ఉచిత సలహాలు పొందడానికి 1097 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. సామాజిక బాధ్యతగా ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ తమ ఆఫీసుల్లో ఈ క్యూఆర్ కోడ్ బోర్డులను ఉంచాలని, హెచ్‌ఐవీ వచ్చినా సరైన మందులు వాడితే సాధారణ జీవితం గడపవచ్చని టీజీఎస్‌ఏసీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ పేర్కొన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.