Mahalakshmi’ LPG scheme : తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరుగ్యారంటీలు అమలు చేస్తామని తెలిపిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కో గ్యారంటీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.  ఆరు గ్యారంటీల్లోని ‘మహాలక్ష్మి’ పథకాన్ని గతంలోనే అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సదుపాయాన్ని మరింత విస్తరించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 42.90 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల చాలామందికి ఈ పథకం అందడం లేదు. దీంతో ఇప్పుడు మరో ఐదు లక్షల పైగా కుటుంబాలు ఈ పథకానికి అర్హమైనవిగా పౌరసరఫరాలశాఖ తేల్చింది. సంబంధిత అర్హుల జాబితాను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే కొత్త లబ్ధిదారులకు కూడా సబ్సిడీ అందుతుంది. 2024 ఫిబ్రవరిలో ఈ పథకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది… రాష్ట్రవ్యాప్తంగా 91.49 లక్షల మంది  మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాడు వీరిలో 42.90 లక్షల మందిని అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వారు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లపై రాయితీ ఇస్తూ వస్తోంది.

Also Read : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు క్లోజ్

దీనికోసం ఏటా బడ్జెట్‌లో రూ.723.30 కోట్లు కేటాయిస్తోంది. కాగా, రేషన్‌ కార్డున్న వారికి మాత్రమే ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో 1.20 కోట్లకు పైగా గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కొందరు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. కొన్ని ఇండ్లలో భార్యాభర్తలిద్దరి పేరు మీద కూడా గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న కుటుంబాలున్నాయి. అయితే వీరిలో చాలామంది ఈ పథకానికి అర్హులైనప్పటికీ వారికి విడిగా రేషన్‌కార్డులు లేకపోవడంతో వారికి పథకం అందలేకపోయింది. వీరితో పాటు  కొత్తగా పెళ్లయిన జంటలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. కాగా,  ప్రభుత్వం 2025 జనవరి నుంచి 2026 జులై వరకు పలు విడతల్లో కొత్తగా పెద్ద ఎత్తున  రేషన్‌కార్డులు జారీ చేసింది. వారంతా తాజాగా సబ్సిడీ గ్యాస్‌ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన పౌరసరఫరాల శాఖ వీటిలో 5 లక్షలకు పైగా అర్హులున్నారని తేల్చింది. ఆ లిస్టును ఆర్థికశాఖ పరిశీలనకు పంపింది. అది ఆమోదం పొందితే మరో ఐదు లక్షల మందికి  ‘మహాలక్ష్మి’ ఎల్పీజీ పథకం అమలు కానుంది.

Also Read : గిగ్ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె వాయిదా

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.