Hyderabad :  అందమైన అబ్బాయితో సరదాగా కాఫీ తాగాలా? సినిమాకు తోడుగా రావాలోయ్.. అదీ 50% ఆఫర్‌తో సోషల్ మీడియాలో ఇలాంటి యాడ్స్ చూసి ఒక్క క్షణం ఆగారా అయితే జాగ్రత్త ఇది మీ ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని, మీ డబ్బులు కొల్లగొట్టడానికి సైబర్ దొంగలు వేసిన కొత్త డేటింగ్ వల. ఈ కలర్‌ఫుల్ పోస్టర్ల వెనుక పెద్ద మోసం దాగి ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా మహిళలను, యువతులను గట్టిగా హెచ్చరించారు.

Also Read : ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ నోట్, ఐఫోన్ మాయం!

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్‌లలో రెంట్ బాయ్‌ఫ్రెండ్ అంటూ రకరకాల ప్యాకేజీలు పెడుతున్నారు. గంటసేపు కాఫీ డేట్ అయితే రూ.499, సినిమాకు వస్తే రూ.1,249, షాపింగ్‌కు తోడొస్తే రూ.1,499, డే రోజంతా ఉంటే రూ.4,499 అంటూ ఒక పెద్ద మెనూ కార్డునే చూపిస్తున్నారు. ఏఐ సాయంతో ముచ్చటగొలిపే కుర్రాళ్ల ఫొటోలు తయారుచేసి ప్రొఫైల్‌గా పెడుతున్నారు. ఆ ఫొటోలు చూసి మెసేజ్ చేయగానే తీపి మాటలు చెప్తూ.. అడ్వాన్స్ డబ్బులు, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఆన్‌లైన్ లో వేల రూపాయలు గుంజుతున్నారు. డబ్బులు పడగానే మిమ్మల్ని బ్లాక్ చేసి మాయమైపోతున్నారు.

కేవలం డబ్బులు పోవడమే కాదు.. ఆన్‌లైన్ చాటింగ్‌లో మీ నంబర్లు, వ్యక్తిగత ఫొటోలు తీసేసుకుని, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే పరిచయం లేని వ్యక్తులను నమ్మి డబ్బులు పంపవద్దు, నేరుగా కలవడానికి వెళ్లవద్దు. పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనేదానిపై తల్లిదండ్రులు కూడా కంటకనిపెట్టి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాల్లో చిక్కుకుంటే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

Also Read : గిగ్ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె వాయిదా

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.