Mysore: కర్ణాటకలోని మైసూర్ లో దారుణం జరిగింది. పని చేసే చోట తీవ్ర వేధింపులు తాళలేక నాగేశ్వరి అనే ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పని ప్రదేశంలో జరిగిన వేధింపుల వివరాలు బయటకు వచ్చాయి. మైసూర్‌లోని హీనకల్ ప్రాంతంలో ఉన్న రిలయన్స్ మార్ట్‌లో, పీపీఎంఎస్ ఏజెన్సీ అనే మార్కెటింగ్ కంపెనీ ద్వారా టాటా ఉత్పత్తుల ప్రోమోటర్‌గా నాగేశ్వరి పనిచేసేది.

గత 15 రోజులుగా ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోందని, ఆఫీసులో తమ కూతురిని వేధిస్తున్నారని తమకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు నాగేశ్వరి రాసిన లేఖలో తన తప్పు లేకపోయినా పై అధికారులు కావాలనే తనను టార్గెట్ చేసుకుని వేధించారని ఆరోపించింది. గత నాలుగు నెలలుగా తనకు ఒక్క వారం కూడా సెలవు ఇవ్వలేదని, అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా లీవ్స్ ఇచ్చేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనను ఉద్యోగం నుంచి కూడా తొలగించారని నాగేశ్వరి లేఖలో పేర్కొంది. డాలీ అనే సూపర్‌వైజర్‌ పేరును స్పష్టంగా ప్రస్తావిస్తూ, ఆ మహిళ వేధింపుల వల్లే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. చిన్న చిన్న విషయాలకు కూడా వేధించి, మానసికంగా కుంగదీశారని బాధిత తల్లి రత్నమ్మ కన్నీరుమున్నీరయ్యారు. తన కూతురికి న్యాయం చేయాలని, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.