
Constable Suicide : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 2024 బ్యాచ్‌కు చెందిన జర్పుల సాయికుమార్ అనే కానిస్టేబుల్ ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో రాత్రి విధులకు హాజరైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే విధుల్లో ఉండగానే ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటలకు ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హుటహుటినా ఘటన స్థలానికి వచ్చిన ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్ వెంటనే సాయికుమార్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు
కాగా, 2024 బ్యాచ్‌కు చెందిన సాయికుమార్‌ను.. ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. అతను కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయంశంగా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read : HCUలో డ్రగ్స్ కలకలం: 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
కుటుంబ సభ్యలు ఆందోళన
ఇదిలా ఉండగా సాయికుమార్ మృతి వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలుపాలంటూ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సాయికుమార్ ఆత్మహత్య చేసుకోలేదని, ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే రక్తపు మరకలు ఎలా వచ్చాయని పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పీఎస్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది ఒక దశలో పీఎస్‌లోకి దూసుకెళ్లి కంప్యూటర్, ప్రింటర్ ధ్వంసం చేయడంతో కలకలం రేగింది. పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు.
కాగా ఆత్మహత్యకు పాల్పడిన సాయికుమార్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం బండనేమూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్జనతండాకు చెందినవాడుగా తెలుస్తోంది. గ్రామానికి చెందిన విజయ, బోడియా దంపతులకు ఐదుగురు సంతానం., వారిలో ముగ్గురు కుమార్తెలు కాగా వారికి వివాహాలు అయ్యాయి, ఇద్దరు కుమారులకు ఇంకా వివాహాలు కాలేదు. ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. చిన్నవాడైన సాయికుమార్ ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన విషయం తెలిసి సంఘటనా స్థలానికి ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది.
Also Read : రాపిడో డ్రైవర్‌ను అంటూ యువతికి బురిడీ…. ఆమె ఇచ్చిన షాక్‌కు పరార్..









