Delhi Airport : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా దళాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో వారికి విచిత్రమైన వస్తువులు దొరికాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడిని బ్యా్‌గ్‌ను తనిఖీ చేసిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అందులో మానవ రూపాన్ని పోలిన జంతువు పుర్రె లభించడం కలకలం రేపింది. దీంతో వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అది ‘కోతి పుర్రె’ అని సదరు ప్రయాణికుడు వెల్లడించాడు. అంతేకాదు ఆ పుర్రెతో పాటు మంత్రదండం లాంటి వస్తువు కూడా అతని వద్ద లభించింది.

సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లే విమానం ఎక్కేందుకు ఆ ప్రయాణికుడు విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపారు. సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ప్రయాణికుడి హ్యాండ్‌బ్యాగ్‌ను ఎక్స్-రే మిషన్ ద్వారా తనిఖీ చేశారు, ఆ సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బ్యాగులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ బ్యాగ్‌ను తెరిచి సోదా చేశారు. అందులో ఒక పుర్రె బయటపడింది. అయితే భద్రతా సిబ్బంది ఆ పుర్రె గురించి ప్రయాణికుడిని ప్రశ్నించారు. అది కోతికి చెందిందని ప్రయాణికుడు సమాధానం ఇచ్చాడు. అయితే విమానంలో ఇలాంటి వస్తువులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం అని చెప్పినఅధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు అతన్ని విచారించిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అనంతరం అతన్ని స్థానిక ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న పుర్రెను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపిన పోలీసులు ఈ వ్యవహారం వన్యప్రాణులకు సంబంధించినది కావడంతో ‘వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972’ (వన్యప్రాణి సంరక్షణ చట్టం) నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఈ పుర్రెను ఆ ప్రయాణికుడు ఢిల్లీలో ఎక్కడి నుంచి సంపాదించాడు? దాన్ని హైదరాబాద్‌ ఎందుకు తీసుకెళ్తున్నాడు? దీని వెనుక ఏవైనా చేతబడులు, మూఢనమ్మకాలు వంటి కారణాలు ఉన్నాయా? లేక అక్రమ రవాణా కోణాలు ఉన్నాయా? అనే విషయాలపై పోలీసులు, సంబంధిత అటవీ శాఖ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.