CM Revanth Reddy : మిల్లర్లు బ‌కాయిప‌డిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వ‌సూలు చేయాల్సిందేన‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు న‌డిపే వారితో సానుకూలంగా ఉంటామ‌ని, ఉద్దేశ‌పూర్వకంగా ఎగ‌వేత‌ల‌కు ప్రయ‌త్నించే వారితో క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తామ‌ని హెచ్చరించారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌పై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తో క‌లిసి ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో స‌మీక్ష నిర్వహించారు. గ‌త ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బ‌కాయిల‌కు అవ‌కాశం ఇచ్చి, తిరిగి ఆ త‌ప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంట‌గ‌ట్టే ప్రయ‌త్నం చేస్తోంద‌ని ఆయన మండిపడ్డారు.

ఇప్పటికే బ‌కాయిల వ‌సూలులో కొంత పురోగ‌తి ఉంద‌ని, అయితే ప్రతి ధాన్యం గింజ‌కు సంబంధించి బ‌కాయిని వ‌సూలు చేయాల్సిందేన‌ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బ‌కాయిల వ‌సూలుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు. విధివిధానాల రూప‌క‌ల్పన పూర్తయిన త‌ర్వాత ఆ నివేదిక‌ను మంత్రివ‌ర్గ ఉప సంఘానికి స‌మ‌ర్పించాల‌ని ఆయన సూచించారు. మంత్రివ‌ర్గ ఉప సంఘం ప‌రిశీల‌న అనంత‌రం ప్రభుత్వం త‌గు నిర్ణయం తీసుకుంటుంద‌ని తెలిపారు. మొండి బ‌కాయిదారులుగా మారిన మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మ‌హిళా సంఘాల‌కు కేటాయించి మిల్లింగ్ బాధ్యత‌ల‌ను మ‌హిళా సంఘాల‌కు అప్పగిస్తామ‌ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రతి సీజ‌న్‌లో ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఇప్పటి నుంచే త‌గు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు. ధాన్యం భారీగా వ‌చ్చే న‌ల్గొండ‌, సూర్యాపేట‌, నిజామాబాద్‌, పెద్దప‌ల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్ ల ఏర్పాటును పైలెట్ ప్రాజెక్టు కింద చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. స్వయం స‌హాయక‌ సంఘాల (SHG) ఆధ్వర్యంలో సైలో బ్యాగ్ నిర్మాణాల‌కు నియోజ‌క‌వ‌ర్గానికి 50 నుంచి 100 ఎక‌రాల భూమిని కేటాయిస్తామ‌ని ముఖ్యమంత్రి తెలిపారు. వీటి నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ, పౌర‌స‌ర‌ఫ‌రాలు, మ‌హిళా సంక్షేమ శాఖ‌ల మంత్రులతో స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని వెల్లడించారు.

వీబీ జీ రామ్ జీ లో ప్లాట్‌పాంల నిర్మాణానికి అవ‌కాశం ఉన్నందున‌, విశాల‌మైన ప్లాట్‌పాంలు నిర్మించి జ‌ర్మన్ టెంట్లతో ధాన్యం నిల్వకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు. మండ‌ల‌, గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేటు గోదాములు, ధాన్యం నిల్వకు ఉపయోగప‌డే క‌ల్యాణ మండ‌పాలు, పాత థియేట‌ర్లు, ఇత‌ర షెడ్లను ముందుగానే గుర్తించి ధాన్యం నిల్వకు లీజుకు తీసుకోవాల‌ని అధికారులకు సూచించారు.ఈ స‌మీక్షలో సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ వి.శేషాద్రి, పౌర‌స‌ర‌ఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సౌత్ ఇండియా రైస్‌మిల్లర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ తూడి దేవేంద‌ర్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.