
Pakistan : పాకిస్థాన్ అసలు బుద్ది మరోసారి బయటపడింది. ఆ దేశ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆయన లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి ఓ బహిరంగ వేదికపై కనిపించారు. అంతేకాకుండా ఆ నిషేధిత ఉగ్రవాద సంస్థ అధిపతి హఫీజ్ సయీద్‌ను పొగడడం, ఇండియాపై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో షేక్ రషీద్.. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్, పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఖాలిద్ మసూద్ సంధు, ఆ ఉగ్రవాద సంస్థ కేంద్ర సలహా కమిటీ సభ్యుడు క్వారీ ముహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి రషీద్ మాట్లాడారు. హఫీజ్ సయీద్‌ను ప్రశంసిస్తూ ఆయనకు తన మద్దతును బహిరంగంగా ప్రకటించారు. నేను హఫీజ్ సాబ్ బానిసను అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అమెరికాలో తాను ఉన్న సమయంలో హఫీజ్ సయీద్ ఫోన్ నంబర్ తన ఫోన్‌కు వచ్చిందని, ఆ కారణంగానే తనను అమెరికా నుంచి వెళ్లగొట్టారని రషీద్ ఆరోపించారు.
అంతటితో ఆగకుండా ఆయన భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వైపు భారత్ ఒక్కసారి కన్నెత్తి చూసినా దేవుడు దానిని సర్వనాశనం చేస్తాడని బెదిరించారు. భారత్‌లో ఏ ఒక్క పక్షి కూడా కిలకిలలాడదు, గుడిలో గంటలు కూడా మోగవు అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఇండియాలో ఏదీ జరగదు అంటూ చెప్పుకొచ్చారు. చివరగా తాము పాకిస్తాన్‌తో, హఫీజ్ సయీద్‌తో ఉన్నాము అని రషీద్ గట్టిగా ప్రకటించారు.
కాగా షేక్ రషీద్ అహ్మద్ 2020 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో దేశాంతర్గత మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఆయన అవామీ ముస్లిం లీగ్ పార్టీ వ్యవస్థాపకుడు, నాయకుడు కూడా.









