Mahesh Kumar Goud : కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేనివారు, పార్టీ కోసం కష్టపడని కొందరు వ్యక్తులు నేడు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో ఎంతో కీలకమైన, ఉన్నతమైన పదవులను అనుభవిస్తుండటం తనను తీవ్రంగా బాధించే విషయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపాయి. కాగా ఈ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. మీడియాతో ఈ రోజు నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలన్నీ హై కమాండ్ దృష్టిలో ఉన్నాయని,సమయం వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాజ్ గోపాల్ వ్యాఖ్యలు తప్పు అన్న మహేశ్‌ గౌడ్‌ క్రమ శిక్షణ దాటితే ఇబ్బందులు తప్పవన్నారు.బాధ, ఆవేదన ఉంటే అది మాట్లాడుకోవడానికి సరైన వేదికలు ఉంటాయి. హై కమాండ్ తో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

హై కమాండ్ రాజ్ గోపాల్ రెడ్డికి ఏమైనా హామీ ఇచ్చి ఉండవచ్చు.హామీ అంశంపై రాజ్ గోపాల్ రెడ్డి హై కమాండ్ తో చర్చించుకోవాలి. లైన్ దాటితే ఎవరైనా ఒకటే. రాజ్ గోపాల్ రెడ్డికి గౌరవం ఇచ్చాం. ఉద్యమంలో లేనిది ఎవరు? పొన్నం, బలరాం నాయక్, మహేష్ గౌడ్, అందరం ఉద్యమంలో ఉన్నామన్నారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు.. ఒకేసారి అందరి కోరికలు తీర్చడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తమినాడు, తెలంగాణ రాజకీయాలు వేరువేరు అన్న మహేష్‌ గౌడ్‌ రాజ్ గోపాల్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించడానికి వీలులేదని తేల్చి చెప్పారు. ఇంకా మాట్లాడుతూ తనకు, సీఎంకి గ్యాప్ లేదని, మా మధ్య గ్యాప్ అనేది మీడియా సృష్టే అన్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తుందన్నారు. సీఎం బ్రదర్స్ పై ఆరోపణలు తప్పు అన్న మహేష్‌ గౌడ్‌ ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధానిగా మోదీనిగౌరవిస్తామని కానీ, రాష్ట్ర స్కీమ్ లలో ప్రధాని బొమ్మ ఎందుకు వేయాలి? రేషన్ కార్డులపై మోదీ బొమ్మ ఎందుకు వేయాలి అని ఆయన ప్రశ్నించారు.

Also Read : పార్టీతో సంబంధం లేనివారికే కీలక పదవులు.. రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇంతకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే..!

గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్తానంపై రూపొందించిన పుస్తకావిష్కరణ సభలో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేనివారు, పార్టీ కోసం కష్టపడని కొందరు వ్యక్తులు నేడు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో ఎంతో కీలకమైన, ఉన్నతమైన పదవులను అనుభవిస్తుండటం తనను తీవ్రంగా బాధించే విషయమని అన్నారు. అంతేకాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలన్నారు, అందుకే ఏపూరి లాంటి కళాకారులు గజ్జె కట్టాలని పిలుపునిచ్చారు. ఏపూరి సోమన్న పాడిన.. ఎవరి పాలైందిరో తెలంగాణ పాటలోని పరిస్థితులే నేడు రాష్ట్రంలో కొనసాగడం బాధకరమని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని.. అలాంటి దోపిడీదారుల వెంట పడదామని, వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని రాజగోపాల్‌ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. మా సహనాన్ని, ఓపికను చేతకాని తనంగా భావించవద్దన్న ఆయన ఇన్నాళ్లు సహనంగా ఉన్నామని, ఇక పోరాటానికి సమయం వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు, పేదలకు న్యాయం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, అభివృద్ది పేరిట తెచ్చిన రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చిన నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్లకే దక్కుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.

Also Read : తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.