Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ మేరకు ఆదేశించారు. సంబంధిత టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు డా.బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన ‘గోదావరి పుష్కరాలు – 2027’ కేబినేట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…కమిటీ సభ్యులు శాఖలవారీగా సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిని ప్రత్యేకంగా సమీక్షించారు. పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Also Read : తెలంగాణలో కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షలు.. కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు!

అనంతరం కేబినేట్ సబ్ కమిటీ ఛైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వేయి కోట్లు కేటాయించిందని తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాలకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని సూచించారు. అలాగే ముఖ్యమైన ప్రాంతాల్లో… ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలా అని… నాణ్యతలో రాజీ పడొద్దని, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని దిశానిర్ధేశం చేశారు. వర్క్ ప్రోగ్రెస్ ను రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తేవాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి శ్రీధర్‌ బాబు సూచించారు.

అన్ని శాఖలు సమష్ఠిగా పని చేస్తేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలు విజయవంతం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. శాఖల మధ్య సమన్వయం లోపం తలెత్తకుండా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి రోడ్డును అనుసంధానించాలన్నారు. ఎక్కడైనా రోడ్ల కనెక్టివిటీ మిస్ అయితే వెంటనే గుర్తించి, లోకల్ ఫండ్స్ నుంచి పనులు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, పండితులను పుష్కర ఏర్పాట్లలో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు సేవలు అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. కేబినేట్ సబ్ కమిటీ సభ్యుల సలహాలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని… అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పుష్కర ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

Also Read : హైదరాబాద్‌లో 65 అంతస్తుల ట్రంప్ టవర్స్.. ప్రత్యేకతలేంటో తెలిస్తే షాక్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.