Independence Day 2026 :  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సప్తధార అనే సరికొత్త ప్రణాళికను ప్రకటించారు. భారత్‌ను సొంత కాళ్లపై నిలబెట్టడంతో పాటు ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చేందుకు ఏడు రంగాలు ఇంజిన్లుగా పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. తయారీ రంగం, రైతులు, టెక్నాలజీ, గతిశక్తి, రక్షణ రంగాలు, గ్రీన్ ఎనర్జీ , సాఫ్ట్ పవర్ అనే ఈ ఏడు రంగాలను బలోపేతం చేయడం ద్వారానే వికసిత భారత్ కల సాకారమవుతుందని ప్రధాని పిలుపునిచ్చారు.

మన దేశ ఆర్థిక ప్రగతికి వస్తువుల తయారీ రంగమే ప్రధాన ఆధారమని ప్రధాని మోదీ చెప్పారు. చిన్న విడిభాగాల నుంచి పెద్ద పరికరాల వరకు ప్రతీది మన దేశంలోనే తయారు కావలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లో మన ఉత్పత్తులు నిలవాలంటే నాణ్యత, తక్కువ ధర, ప్యాకింగ్ విషయంలో రాజీ పడకూడదని సూచించారు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, మన రైతులు పండించే పండ్లు, కూరగాయలు, నూనె దినుసులు, సాంప్రదాయ ధాన్యాలను విదేశీ మార్కెట్లలో భారీ ఎత్తున విక్రయించి గ్లోబల్ బ్రాండ్లుగా మార్చాలని పిలుపునిచ్చారు.

Also Read : సెక్యూరిటీ గార్డు వేషంలో టెర్రరిస్ట్ కుట్ర.. బెంగాల్ యువకుడు అరెస్ట్!

మరోవైపు టెక్నాలజీ విభాగంలో మన తాకతేంటో ఇప్పటికే యూపీఐ డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పామని ప్రధాని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రోబోటిక్స్, డేటా సెంటర్లలో భారత్ కేంద్రంగా మారాలని, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 6జీ నెట్‌వర్క్‌ను దేశమంతటా అందుబాటులోకి తీసుకురావడమే తదుపరి లక్ష్యమని తెలిపారు. దీంతో పాటు వ్యాపారాలు వేగంగా సాగడానికి, రవాణా తేలికగా మారడానికి కొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

దేశ భద్రత విషయానికి వస్తే రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించడం చాలా కీలకమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మన సైన్యానికి కావలసిన ఆయుధాలు మనమే తయారు చేసుకోవడంతో పాటు, ప్రస్తుతం ఎంతో అవసరమైన డ్రోన్ , కౌంటర్ డ్రోన్ సాంకేతికతలో భారీగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. చివరిగా మన దేశ యోగా, సినిమాలు, యానిమేషన్, డిజిటల్ కంటెంట్ , నేషనల్ పార్కులు మన దేశపు గొప్ప సాఫ్ట్ పవర్ అని, వీటన్నింటి ద్వారా విదేశీ టూరిస్టులను పెద్ద ఎత్తున ఆకట్టుకోవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read : విలీనం దిశగా ఉబర్‌- రాపిడో అడుగులు? చివరి నిమిషంలో…

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.