
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశ యువతకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. మన యువతలోని ప్రతిభను వెలికితీసి, భారత్‌ను ప్రపంచంలోనే ముందంజలో నిలబెట్టడమే లక్ష్యంగా మూడు సూపర్ ప్లాన్స్‌ను ప్రకటించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన భారతదేశపు ఏఐ సదస్సును మోదీ ప్రస్తావిస్తూ.. రాబోయే ఒకే ఒక్క ఏడాదిలో దేశంలో ఉన్న కోటి మంది యువకులకు లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా మోదీ ప్రకటించారు. ఇక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వల్ల పేద, మధ్యతరగతి తల్లిదండ్రులపై పడుతున్న వేల కోట్ల రూపాయల భారాన్ని తగ్గించేందుకు, ప్రభుత్వమే మేలైన ఉపాధ్యాయులు, డిజిటల్ నెట్‌వర్క్‌తో ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందుబాటులోకి తెస్తుందని తెలిపారు.
Also Read : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు త్రిష.. సీఎం విజయ్ తల్లిదండ్రులతో కలిసి!
2036 ఒలింపిక్స్ లక్ష్యంగా గల్లీ స్థాయి నుంచి ప్రతిభ కలిగిన 5 నుండి 15 ఏళ్ల చిన్న పిల్లలను గుర్తించి, వారికి వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ కోచింగ్ ఇస్తామని స్పష్టం చేశారు. ఒలింపిక్స్‌లో దాదాపు 40 క్రీడాంశాలలో 350 ఈవెంట్లు ఉంటాయి. కనీసం అర్హత కూడా సాధించలేకపోవడం వల్ల, ఈ ఈవెంట్లలో మూడింట రెండు వంతుల ఈవెంట్లలో కూడా మనం పోటీపడలేకపోవడం విచారకరమని మోదీ అభిప్రాయపడ్డారు.
వీటితో పాటు దేశ భద్రత కోసం కొత్త సివిల్ డిఫెన్స్ దళాల ఏర్పాటు, సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ల పెంపు, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక నిర్ణయాలను ప్రధాని తన ప్రసంగంలో ఆవిష్కరించారు.
ప్రధాని మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపించిన గ్లోబలైజేషన్ మాట ఇప్పుడు తగ్గిందని, భారత్ తన సొంత సామర్థ్యంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని స్పష్టం చేశారు. బలమైన న్యాయవ్యవస్థ, ఆర్థిక స్థిరత్వంతో 2014 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలతో కీలకమైన వ్యాపార ఒప్పందాలు చేసుకున్నామని ప్రధాని తన ప్రసంగంలో తెలిపారు.
వికసిత్ భారత్ సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. మన దేశంలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, భారత్ వేగంగా డిజిటల్ ఇన్నోవేషన్ హబ్ గా మారుతోందని చెప్పారు. అభివృద్ధి పథంలో మన దేశం ఇకపై ఆగేదే లేదని, తగ్గేదే లేదని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో యువత, మహిళల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు.
Also Read : VIP గొడవ: మహిళా ఎస్ఐపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే కుమార్తె!









