
Chief Justice : నాల్సార్ లా కాలేజీ వివాదం ముగియకముందే, బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ లో కూడా అలాంటి గొడవే మొదలైంది. తమ కాలేజీ వేడుకకు దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రాలను ముఖ్య అతిథులుగా పిలవడాన్ని అక్కడ చదువుతున్న విద్యార్థులు, పాత విద్యార్థులు తీవ్రంగా తప్పుపట్టారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని నాల్సార్ లా కాలేజీ వేడుకకు సిజెఐని పిలవడాన్ని కొందరు విద్యార్థులు వద్దన్నారు. దీనిపై కోపం తెచ్చుకున్న బార్ కౌన్సిల్, ఆ కాలేజీ 2026 బ్యాచ్ విద్యార్థులెవ్వరికీ లాయర్లుగా ప్రాక్టీస్ చేసే లైసెన్స్ ఇవ్వకూడదని సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున గొడవ జరగడంతో బార్ కౌన్సిల్ ఆ ఉత్తర్వులను వెంటనే రద్దు చేసుకుంది. విద్యార్థుల ఆలోచనలను, వారి హక్కులను గౌరవిస్తామని చెబుతూ అధ్యక్షుడు మిశ్రా క్షమాపణలు కూడా చెప్పారు.
Also Read : ఇన్స్టాలో దిమాగీ నక్సల్ పార్టీ సంచలనం.. ఒక్కరోజులోనే 1.6 లక్షల ఫాలోవర్స్!
ఇప్పుడు బెంగళూరు కాలేజీ విద్యార్థులు నాల్సార్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులను లేదా ప్రభుత్వ వ్యవస్థలను విద్యార్థులు ప్రశ్నిస్తే, వారి భవిష్యత్తును పాడు చేస్తామని భయపెట్టడం చాలా తప్పని వారు ఒక లేఖలో చెప్పారు. నాల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
అసలు ఈ గొడవ ఢిల్లీలో జరిగిన ఒక గొడవతో మొదలైంది. జంతర్ మంతర్ దగ్గర కోక్రోచ్ జనతా పార్టీ నిరసనలో పోలీసులు దౌర్జన్యం చేశారంటూ వేసిన ఒక కేసు విచారణలో, సిజెఐ సూర్య కాంత్ మా సమయం వృథా చేయకండి అని అన్నారనే వార్త వచ్చింది. అయితే తాను కేసును సరిగ్గా దాఖలు చేయమని మాత్రమే చెప్పానని ఆయన ఆ తర్వాత వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలు నచ్చక నాల్సార్ విద్యార్థులు ఆయన రాకను వ్యతిరేకించారు.
విద్యార్థులు అలా అనడంతో కోపం వచ్చిన బార్ కౌన్సిల్, కోర్టును గౌరవించని వారు మంచి లాయర్లు కాలేరంటూ విద్యార్థుల లైసెన్సులపై నిషేధం విధించింది. కానీ దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో, కొందరు చేసిన దానికి అందరినీ శిక్షించడం తప్పు అని ఒప్పుకుంటూ ఆ రాత్రికే ఆ ఆదేశాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు, బార్ కౌన్సిల్, లా విద్యార్థుల నడుమ ఒక పెద్ద చర్చగా మారింది.
Also Read : మా కాలేజీకి రావొద్దు.. సీజేఐ రాకపై బెంగళూరులో విద్యార్థుల నిరసన!









