Sanathnagar TIMS : హైదరాబాద్ సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్)ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాగా, ఈ ఆసుపత్రిని 1,082 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో 300 ఐసీయూ బెడ్లు, 400 సాధారణ బెడ్లు, 88 ఎమర్జెన్సీ బెడ్లు, 30 డయాలసిస్ బెడ్లతోపాటూ.. మెడికల్ టూరిజం, ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా 264 బెడ్లు ఏర్పాటు చేశారు. తొలి దశలో సుమారు 582 పడకలతో సేవలు ప్రారంభమవుతాయనీ, మిగిలినవి అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

కాగా, ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 1,070 నుంచి 1,126 కోట్ల మధ్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీన్ని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 22.6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ వైశాల్యం 11.68 లక్షల చదరపు అడుగులుగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్ 21న పరిపాలనా అనుమతి లభించగా, ఏప్రిల్ 26న శంకుస్థాపన జరిగింది. నిర్మాణం 2023 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) డిజైన్-బిల్డ్ మోడల్‌లో ఈ ప్రాజెక్టును నిర్మించింది.

Also Read : తెలంగాణ సమగ్ర సవరణ (సర్‌) (SIR) ముసాయిదా విడుదల.. మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి..

ఇక ఈ ఆసుపత్రి కార్డియాక్, రీనల్, ట్రాన్స్‌ప్లాంట్, ట్రామా సైన్సెస్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా రూపొందించబడింది. ఆసుపత్రిలో 37 విభాగాలు ఉండగా, ప్రధానంగా కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలో15 ప్రధాన ఆపరేషన్ థియేటర్లు, క్యాత్ ల్యాబ్స్, ఎమ్ఆర్‌ఐ, సీటీ స్కాన్, రేడియేషన్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ సౌకర్యాలు లభిస్తాయి. ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం విశేషం. ఇది రక్త నమూనాలు, వైద్య రిపోర్టులను వార్డులు, ల్యాబ్‌లు, ఫార్మసీ మధ్య 1-2 నిమిషాల్లో తరలించేందుకు దోహదం చేస్తుంది.

Also Read : నాడు 420 హామీలు… నేడు 420 మాటలు… సీఎం రేవంత్‌ పై హరీశ్‌రావు సంచలన కామెంట్స్‌

కాగా, నిర్మాణం పూర్తయిన ఈ ఆసుపత్రి మే 1, 2026 నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఓపీ విభాగంలో రోజూ 80 నుంచి 250 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. జూలై 31న ఈ సంస్థకు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నా రెడ్డి పేరు ప్రతిపాదించారు. ఆసుపత్రి డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్ నియమించారు. అలాగే ఆసుపత్రి కోసం ప్రభుత్వం 2,360 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 1,633 వైద్య పోస్టులు ఉన్నాయి. అన్ని 17 ముఖ్యమైన అనుమతులు, ఫైర్ ఎన్‌ఓసీ, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ వంటివి ఇప్పికే పూర్తయ్యాయి.

ఈ ఆసుపత్రి ప్రారంభం తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందించే దిశగా పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. దీని నిర్మాణం మూలంగా నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే దీనిద్వారా అధునాతన చికిత్సలు స్థానికంగా అందుబాటులోకి వస్తాయి. అకాడమిక్, రీసెర్చ్ సౌకర్యాలు, మల్టీ-లెవల్ పార్కింగ్, రోగుల అటెండెంట్ల కోసం వసతి కూడా ఈ ఆసుపత్రిలో ఉన్నాయి. ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ పొందిన ఈ ఆసుపత్రి నీటి పొదుపులో 75 శాతం సాధించడం గమనార్హం.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.