
Tamil Nadu : తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది. మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి ఏకంగా 365 రోజులకుపెంచుతున్నట్లు అసెంబ్లీలో వెల్లడించింది. దీనితో మొదటి ఇద్దరు పిల్లలకు లభించే సంవత్సరం ప్రసూతి సెలవుల ప్రయోజనం ఇకపై మూడో బిడ్డకు కూడా సమానంగా వర్తించనుంది.
అసెంబ్లీలో మానవ వనరుల నిర్వహణ శాఖ డిమాండ్లపై జరిగిన చర్చ సందర్భంగా ఆ శాఖ మంత్రి డి. శరత్‌కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సామాజిక సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చే సంక్షేమ ప్రభుత్వంగా ఈ మార్పు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరి కంటే తక్కువ పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు 365 రోజుల సెలవు ఉండగా, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 12 వారాల (84 రోజులు) వేతనంతో కూడిన సెలవు మాత్రమే లభించేది.
ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం ప్రకటించిన సమయానికే, టీవీకే పార్టీకి చెందిన తొలిసారి ఎమ్మెల్యే ఆర్. పల్లవి తన పసిపాపతో శాసనసభకు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. సభా ప్రాంగణంలో సంరక్షకురాలి వద్ద బిడ్డను ఉంచి ఆమె సభలో పాల్గొన్నారు. చిన్నారిని వెంట తెచ్చుకోవడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపట్ల ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఎవరైనా కామెంట్ చేసే ముందు ఆలోచించాలి. పసిపాపను ఇంట్లో వదిలి రావడం సాధ్యం కాదు. ఇతరుల బాధను అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ, ఇలా ట్రోల్ చేయకండి అని ఆవేదన వ్యక్తం చేశారు.









