
CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ ఎమ్మెల్యేలకు బిగ్ ఆఫర్ ఇచ్చారు. 234 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక ప్రభుత్వ వాహనాన్ని కేటాయిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. నియోజకవర్గాల్లో పర్యటించడానికి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని, దీనివల్ల పారదర్శకమైన, అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీసీకే పార్టీ ఎమ్మెల్యే జోతిమణి సభలో మాట్లాడుతూ.. సరైన సదుపాయాలు లేకపోతే ఎమ్మెల్యేలు సరిగా పనిచేయలేరని, కాబట్టి వాహనాలు కేటాయించాలని కోరగా సీఎం వెంటనే స్పందించారు. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్లో చాలామంది మొదటిసారి గెలిచినవారని, సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నవారని విజయ్ గుర్తుచేశారు. అలాంటి వారికి ప్రజలకు సేవ చేసేందుకు కారు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
కారు ఇవ్వడమే కాకుండా, దాని మెయింటెనెన్స్ కోసం డ్రైవర్ జీతం, పెట్రోల్ అలవెన్స్ కింద ప్రతి ఎమ్మెల్యేకు నెలకు రూ. 75 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడానికి ఒక సెక్రటరీ నియమించుకునేందుకు అదనంగా మరో రూ.25,000 అలవెన్స్ ఇస్తామన్నారు. పేద సభ్యులు, మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఏ ఇబ్బంది లేకుండా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తీర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
సీఎం చేసిన ఈ ప్రకటనపై ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే సబరి ఐయంగారన్ మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. తనకు ఉద్యోగం కానీ, కారు కానీ లేవని, చెన్నైకి ట్రైనులోనే వస్తానని చెప్పారు. ఆటోలో అసెంబ్లీకి వస్తే ఐడీ కార్డు చూపిస్తే తప్ప పోలీసు అధికారులు నమ్మే పరిస్థితి లేదని, ఇప్పుడు సీఎం విజయ్ తమకు కారు, హోదా కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. మరొక టీవీకే ఎమ్మెల్యే సింధు అసెంబ్లీలోనే ఎంజీఆర్ హిట్ సాంగ్ కొడుత్తదెల్లామ్ కొడుత్తాన్ అని పాడి సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. విపక్షాలు పైకి ఒప్పుకోకపోయినా, అందరు ఎమ్మెల్యేలకు ఇది సంతోషకరమైన విషయమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే తరగై కత్‌బర్ట్ అన్నారు. మంత్రి రాజ్‌మోహన్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, దీనివల్ల డ్రైవర్లు, సెక్రటరీలకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు.
అయితే ప్రతిపక్షమైన డీఎంకే మాత్రం విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. 234 మంది ఎమ్మెల్యేలకు కొత్త కార్లు కొనడం, ప్రతినెల అంత పెద్ద మొత్తంలో అలవెన్సులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై విపరీతమైన భారం పడుతుందని డీఎంకే ప్రతినిధి ఎ.శరవణన్ విమర్శించారు. నిధులన్నీ అనవసర ఖర్చులకు ఉపయోగిస్తున్నారని, అసలు కార్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.









