
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన ‘అర్నబ్’ తుఫాను(Cyclone Arnab) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ తుఫాను తీవ్రరూపం దాల్చి తీరం వైపు వేగంగా దూసుకువస్తుండటంతో ఇరు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరప్రాంత , లోతట్టు ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : చైనాకు చెక్: అరుణాచల్ సరిహద్దుల్లో ‘శౌర్య కమాండోల’ దూకుడు!
ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం పోర్టులలో ప్రమాద హెచ్చరికలు జారీ కాగా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగా సిద్ధం చేశారు. రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
హైదరాబాద్లో సాయంత్రం వేళల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముంది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యే ప్రమాదం ఉన్నందున జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. నదులు, వాగులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, వైద్య సేవలు, నిత్యావసరాలను సిద్ధంగా ఉంచారు.
Also Read : TDP నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్









