YCP : ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో సందడి కనిపిస్తోంది. మరోవైపు వైసీపీకి మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 96 కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. మిగిలిన స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు.

Also Read : మున్సిపల్ ఎన్నికల్లో వాసిరెడ్డి పద్మ కుమార్తె విక్టరీ!

మండపేట మున్సిపాలిటీలో అయితే కూటమి అభ్యర్థులు తిరుగులేని ఆధిపత్యం చూపించారు. మొత్తం 36 వార్డులకు గాను 36 వార్డులనూ కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్‌ చేశారు. కొవ్వూరు మున్సిపాలిటీలోనూ కూటమి హవా కొనసాగింది. మొత్తం 28 వార్డులకు గాను 27 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ కూడా వైసీపీ ఖాతా తెరవలేదు. ఇక నిడదవోలు మున్సిపాలిటీలో మాత్రం పోటీ ఆసక్తికరంగా సాగింది. మొత్తం 32 వార్డులకు గాను జనసేన 14, టీడీపీ 13, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. వైసీపీ మూడు వార్డుల్లో విజయం సాధించగా.. మరో స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇందుకోసం 138 కౌంటింగ్‌ కేంద్రాలు, 6,831 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 62.16 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కడప జిల్లాలో బద్వేలు మున్సిపాలిటీని కూటమి కైవసం చేసుకోగా, ఎర్రగుంట్లలోనూ కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లో విజయం సాధించారు. ఇంకా పలు ప్రాంతాల్లో ఫలితాలు వెలువడుతున్నాయి.

Also Read : పులివెందులలో జగన్ సంచలన నిర్ణయం: స్థానిక ఎన్నికలపై YCP ప్లాన్ ఇదే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.