Ranga Reddy :  రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్‌ (28) అనే వ్యక్తి ఏకంగా ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఒక బాలికను వేధించాడు. దీనిపై ఆ బాలిక, ఆమె తల్లి కలిసి ఈ ఏడాది మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే, ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు.. తనను జైలుకు పంపిన వారిపై పగ పెంచుకున్నాడు.

ఈ కక్షతోనే శనివారం తెల్లవారుజామున షాబాద్‌ మండలంలోని దైవాలగూడలో ఉన్న బాధితులపై దాడి చేసి, ఆరుగురిని ప్రాణాలతో నరికి చంపాడు. ఈ ఘోరానికి ఒడిగట్టిన తర్వాత రాజ్‌కుమార్ నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. షాక్‌కు గురైన నిందితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Also Read : తెలంగాణలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’‌…పార్టీని బలోపేతం చేయాలని జేపీ నడ్డా పిలుపు!

సమాచారం అందుకున్న వెంటనే సైబరాబాద్ సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ దారుణ హత్యల్లో వేధింపులకు గురైన బాలిక, ఆమె తల్లి, నానమ్మలతో పాటు.. నిందితుడి భార్య సరిత, అతని మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘోరంపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దారుణ ఉదంతం తర్వాత నిందితుడు రాజ్‌కుమార్ నేరుగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. “నేను ఆరుగురిని చంపేశాను.. ఇప్పుడు నేను కూడా చనిపోతున్నాను” అని వారికి చెప్పాడు. కొడుకు మాటలు విని షాక్‌కు గురైన తల్లిదండ్రులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

నిందితుడి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో సైబరాబాద్ సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న ఆరుగురి మృతదేహాలను చూసి అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరుగురిని పొట్టనబెట్టుకుని తాను కూడా చనిపోతానని చెప్పిన నిందితుడు రాజ్‌కుమార్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? అనే కోణంలో ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also Read : రాజకీయ రగడ రాజేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌…అసలు ప్రాజెక్టు వివాదాలకు కారణం ఏంటంటే?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.