
Karnataka : కర్ణాటకలో ఒక కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు పెళ్లి సంబంధం విషయంలో డబ్బు డిమాండ్ చేసి, దాన్ని అడ్డుకున్న సొంత కూతురిపైనే కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ దుర్గపై ఆమె తండ్రి నాగేంద్ర జూలై 25వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల ప్రాంతంలో ఈ దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Also Read : వింత దొంగలు.. దేవుడికి మొక్కి మరీ హుండీ ఎత్తుకెళ్లారు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగేంద్ర తన కూతురు లక్ష్మీ దుర్గకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఒక వరుడి కుటుంబం పెళ్లికి అంగీకరించిన తర్వాత, తన కూతురి చదువు, కెరీర్ కోసం తాను చాలా ఖర్చు పెట్టానని చెప్పి ఆ వరుడి కుటుంబం నుంచి నాగేంద్ర రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా లక్ష్మీ దుర్గ సంపాదించే నెలవారీ జీతం మొత్తం తనకే ఇవ్వాలని పట్టుబట్టాడు.
తండ్రి చేస్తున్న ఈ డిమాండ్లను లక్ష్మీ దుర్గతో పాటు ఆమె తల్లి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగి కుటుంబంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ కక్షతోనే సంఘటన రోజు నాగేంద్ర నేరుగా కాలేజీకి వెళ్లి, తన కూతురిని కలవాలని సిబ్బందికి చెప్పి హెచ్‌ఓడీ గదిలోకి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో వెంట తెచ్చుకున్న కత్తితో కూతురు లక్ష్మీ దుర్గ పొత్తికడుపు, ఛాతీ, మెడపై విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడైన తండ్రి నాగేంద్రను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Also Read : వీడో ముదురు మాయలోడు.. ఐదుగురితో ప్రేమ… ఇద్దరిపై లైంగికదాడి…ఆపై…









