Maharashtra :  మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు వరద నీటిలో కారుతో సహా కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన మృతదేహాలను శుక్రవారం నాడు వెలికితీశారు.

గురువారం నాడు ఈ కుటుంబం అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉప్పొంగి వంతెనపై ప్రవహిస్తోంది. వరద నీటి ఉధృతిని, లోతును అంచనా వేయడంలో డ్రైవర్ విఫలమవడంతో, వంతెన దాటే ప్రయత్నం చేసిన కారు ఒక్కసారిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.

కారు నీటిలో కొట్టుకుపోతున్న సమయంలో, అపాయాన్ని గ్రహించిన అవినాష్ ఖండేరే అనే వ్యక్తి అత్యంత చాకచక్యంగా వ్యవహరించి సమీపంలోని చెట్టును గట్టిగా పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, తన భార్య మాధవి, ఇద్దరు చిన్న కుమార్తెలు కారులోనే కళ్లముందే వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండటాన్ని ఆయన నిస్సహాయంగా చూస్తూ రోదించాల్సి వచ్చింది.

ఈ ప్రమాారం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాత్రింతా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన యంత్రాంగం, కారుతో పాటు ఆ ముగ్గురి మృతదేహాలను బయటకు వెలికితీశారు.

మహారాష్ట్రలో రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. కాగా, ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలో ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 10 మంది గాయపడ్డారు.

భారీ వర్షాల కారణంగా దాదాపు 100 ఇళ్లు దెబ్బతిన్నాయని, వరద ముంపునకు గురైన వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర అత్యవసర నియంత్రణ కేంద్రం వెల్లడించింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.