
Hyderabad : అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ముస్లిం అని తెలిసినందుకు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సోహైలుద్దీన్‌పై జరిగిన కత్తి దాడి ఘటన పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది. సోమవారం వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్ మాల్‌లో సోహైలుద్దీన్ పనిచేస్తున్న సమయంలో పీటర్ మైఖేల్ లార్సన్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు సోహైలుద్దీన్‌ను ఎక్కడి నుండి వచ్చావని అడిగి, ఆపై అతను ముస్లిం అని తెలియగానే 15 సార్లు కత్తితో పొడిచాడు. నిందితుడు “ముస్లింలను చంపాలనుకుంటున్నాను” అని పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
Also Read : మేడిగడ్డ డ్యామేజ్..సీఎం రేవంత్ సంచలనం : రేపు కేబినెట్ అత్యవసర భేటీ
ప్రస్తుతం సోహైలుద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. అతనికి వరుసగా పలు శస్త్రచికిత్సలు జరిగాయి. తన కుటుంబానికి సోహైలుద్దీన్ ఒక్కడే ఆధారం కావడంతో, అతని వైద్య ఖర్చుల కోసం స్నేహితురాలు లూనా నూనెజ్ గో ఫండ్ మీ ద్వారా ఆన్‌లైన్ నిధిని సేకరించారు. దీనికి అద్భుతమైన స్పందన లభించి, గురువారం నాటికి రూ. 2 కోట్లకు పైగా విరాళాలు అందాయి.
ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితుడి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని భారత దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, హత్యాయత్నం, ప్రమాదకర ఆయుధాన్ని కలిగి ఉన్నారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు.
Also Read : మల్లప్ప కొండలో మిస్టరీ హత్య: భర్త దారుణ హత్య.. భార్య, చిన్నారి అదృశ్యం









