
Uday Krishna Reddy : ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, స్టాకింగ్, ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడిన కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్‌కృష్ణారెడ్డి (33)ని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం బుధవారం నిందితుడిని ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు వివరాలను నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్‌కృష్ణారెడ్డి గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా సేవలందించారు. ఆ తర్వాత పట్టుదలతో చదివి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. గతేడాది డిసెంబరు నుంచి హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVP NPA)లో ఆయన శిక్షణ పొందుతున్నారు. 2024 మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక మహిళతో ఇతనికి పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య స్నేహానికి, ఆపై ప్రేమకు దారితీసింది. బాధిత మహిళ కూడా 2024 బ్యాచ్ ఐపీఎస్‌కు ఎంపికై, సెలవులో ఉన్న కారణంగా 2025 బ్యాచ్‌తో కలిసి శిక్షణ పొందేందుకు సిద్ధమయ్యారు. అకాడమీలో శిక్షణ సమయంలో వీరిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు, మనస్పర్ధలు తలెత్తాయి. బాధితురాలు అతని ప్రవర్తన నచ్చక దూరంగా ఉండటానికి ప్రయత్నించగా, తట్టుకోలేకపోయిన ఉదయ్‌కృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, ఆయుధాలు చూపి భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు.
Also Read : థాయ్‌లాండ్‌లో ‘బడ్జెట్ టూర్’ పేరిట ముగ్గురు భారతీయ యువకుల కిడ్నాప్: ఐదుగురు నిందితుల అరెస్ట్
అంతేకాకుండా బాధితురాలి ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేయడం, ఆమెపై తప్పుడు ప్రచారాలు చేస్తూ గౌరవానికి భంగం కలిగించడం, ఆమె కుటుంబ సభ్యులు, సహచరులను వేధించడం మొదలుపెట్టాడు. బ్లాక్ చేసిన తర్వాత నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వ్యక్తిగత చాట్‌లను బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఇతడి వేధింపులు తాళలేక ఆమె ఆ బంధాన్ని తెంచుకుని మరొకరిని వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, బాధితురాలు జూలై 18న అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
కేసు దర్యాప్తులో భాగంగా జూలై 28 రాత్రి ఆరాంఘర్ ఎక్స్ రోడ్స్ సమీపంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నిందితుడిని అశోక్‌నగర్‌లోని అతడి పూర్వ నివాసానికి తీసుకెళ్లి సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేశారు. దర్యాప్తులో వేధింపులు నిజమేనని ప్రాథమిక ఆధారాలు లభించడంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (ఉప్పర్‌పల్లి కోర్టు) ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
మరోవైపు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉదయ్‌కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ జె. శ్రీనివాసరావు ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వానికి , బాధితురాలికి వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 26వ తేదీకి వాయిదా వేసింది.
Also Read : వెబ్‌సైట్ హ్యాక్ చేస్తే మరో ఛాన్స్… ఐఐటీ కన్పూర్ సంచలన నిర్ణయం!









