Road Accident :  తిరుచిరాపల్లి-మధురై జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై జిల్లాలోని వంచినగరం బస్ స్టాప్ సమీపంలో ప్రభుత్వ బస్సు, ప్రైవేట్ బస్సు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ విషాదకర ఘటనలో ఒక మహిళతో సహా మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో సుమారు 41 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 15 మందిని మెట్టూరు ప్రభుత్వ ఆసుపత్రి, మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి , ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Also Read : షాబాద్‌లో పోక్సో కేసు కక్ష.. ఆరుగురిని దారుణంగా నరికి చంపిన ఉన్మాది!

ప్రమాదంలో మరణించిన వారిని తిరుచిరాపల్లికి చెందిన పి. ఆనందరాజ్ (46), జి. సూర్య (29), తిరువారూర్‌కు చెందిన కె. మహమ్మద్ యాసిన్ (60)గా గుర్తించారు. వీరు ముగ్గురూ ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్నారు. అలాగే తిరునల్వేలికి చెందిన జె. సిరియపుష్పం (56), జె. అబ్రహం (40) అనే ఇద్దరు ఓమ్ని బస్సులో ప్రయాణిస్తూ మరణించారు. వీరితో పాటు ప్రమాదం జరిగిన సమయంలో వంచినగరం బస్ స్టాప్ వద్ద నిద్రిస్తున్న కొత్తంపట్టికి చెందిన సి. పెరుమాళ్ (70) కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలన్నింటినీ మెట్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చెన్నై నుండి కన్యాకుమారి జిల్లాలోని మార్తాండం వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి, డివైడర్‌ను దాటి అవతలి వైపు నుండి మధురై నుండి తిరుచిరాపల్లి వైపు వస్తున్న ప్రభుత్వ బస్సును బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ ప్రైవేట్ బస్సు మళ్లీ డివైడర్‌ను దాటి తన ట్రాక్‌లోకి వచ్చి, పక్కనే ఉన్న బస్ స్టాప్‌ను కూడా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరిగిందో కూడా తెలిసేలోపే ఈ ఘోరం జరిగిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రభుత్వ , ప్రైవేట్ అంబులెన్స్‌లను రప్పించి గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. మధురై రేంజ్ డీఐజీ అభినవ్ కుమార్, మధురై ఎస్పీ ఎన్. దేవనాథన్ ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలను వేగవంతం చేశారు.

Also Read : అయోధ్య ‘రామధనం’ కొల్లగొట్టిన బకాసురులు: విరాళాల కుంభకోణంలో షాకింగ్ నిజాలు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.