Mamitha Baiju :  ప్రముఖ మలయాళ నటి మమిత బైజు తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా ఈ వారం ఆమె చేయాల్సిన ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ నిర్వహించనున్న ఓనం వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది.అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నందున ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు మమిత తెలిపారు. ఆరోగ్యం సహకరించి ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమానికి వచ్చేదానినని చెప్పారు. కానీ వైద్యులు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ప్రయాణం చేయడం సాధ్యం కావడం లేదన్నారు.

తీవ్ర జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, అలర్జీ సమస్యలు కూడా ఉన్నాయని మమిత వెల్లడించారు. తనకు ఆస్తమా కూడా ఉండటంతో ప్రస్తుతం ప్రయాణం చేయడం మరింత కష్టంగా మారిందని తెలిపారు. ఆస్ట్రేలియా కార్యక్రమానికి హాజరు కాలేకపోతుండటంపై మమిత అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి కార్యక్రమంలో పాల్గొనాలని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని చెప్పారు. కానీ ఆరోగ్యం కారణంగా పర్యటనను రద్దు చేయడం తప్ప తనకు మరో మార్గం లేకపోయిందన్నారు. లేకపోతే ఎలాగైనా కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నించేదానినని తెలిపారు.

తన కోసం ఎదురుచూస్తున్న నిర్వాహకులకు, అభిమానులకు మమిత క్షమాపణలు చెప్పారు. కమ్యూనిటీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగం కావాలని తాను కోరుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో మరోసారి ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి వేడుకల్లో పాల్గొనే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. మమిత బైజు నటించిన తాజా చిత్రం బెత్లెహెం కుడుంబ యూనిట్‌ థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో యాష్లే అనే యువతి పాత్రలో మమిత నటించారు. ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఆమె సూర్య సరసన నటించిన విశ్వనాధ్ అండ్ సన్స్ కూడా మంచి విజయాన్ని సాధించింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.