చైనా ఎయిర్ ఫోర్స్ తమ అత్యంత శక్తివంతమైన 5వ జెనరేషన్ J-20 స్టెల్త్ ఫైటర్ జెట్ల అభివృద్ధిపై కీలక వివరాలను వెల్లడించింది. స్వదేశీ ఇంజిన్ల వినియోగం, ఆధునిక ఏరోడైనమిక్ డిజైన్, అప్‌గ్రేడెడ్ సెన్సార్ సిస్టమ్స్ మరియు కొత్తగా తీసుకొచ్చిన టూ-సీటర్ J-20S వేరియంట్‌తో ఈ జెట్లను భవిష్యత్ యుద్ధ తంత్రాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు చైనా ప్రభుత్వ మీడియా నివేదించింది.

జె-20 డెవలప్‌మెంట్‌లో స్వదేశీ ఇంజిన్ల ఏర్పాటు ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. 2021 జుహై ఎయిర్‌షోలో తొలిసారిగా ప్రదర్శించిన ఈ ఇంజిన్లు విమానానికి తిరుగులేని ప్రొపల్షన్ పవర్‌ను అందిస్తున్నాయి. సైనిక నిపుణుడు వాంగ్ మింగ్‌లియాంగ్ ప్రకారం.. ఈ కొత్త ఇంజిన్లతో జె-20 అత్యధిక వేగాన్ని అందుకోవడమే కాకుండా, స్థిరమైన ‘సూపర్‌సోనిక్ క్రూయిజ్’ వేగంతో ప్రయాణిస్తూ, అధిక ఓవర్‌లోడ్‌లతో సంక్లిష్టమైన విన్యాసాలు చేయగలదు. ఇంజిన్ వ్యవస్థలపై స్వయంప్రతిపత్తి లభించడం చైనా భవిష్యత్ ఫైటర్ జెట్ల ప్రాజెక్టులకు బలమైన పునాదిగా మారింది. ఉన్నతీకరించిన సింగిల్-సీట్ మోడల్ ‘జె-20ఎ’ (J-20A)లో రెండు ప్రధాన మార్పులు చోటుచేసుకున్నాయి.

Also Read : మళ్లీ నంబర్ 1గా ముకేశ్ అంబానీ: ఒక్క రోజే రూ. 66 వేల కోట్ల జంప్!

కాక్‌పిట్ వెనుక భాగాన్ని ఫ్యూజ్‌లేజ్‌తో కలిపే అనుసంధానాన్ని మరింత వంపుగా, స్మూత్‌గా మార్చారు. ఇది గాల్లో డ్రాగ్‌ను తగ్గించి, ఏరోడైనమిక్ పనితీరును మెరుగుపరుస్తూ విమాన వేగాన్ని పెంచుతుంది.

ముక్కు కింద ఉండే ఆప్టికల్ లెన్స్‌ల సంఖ్యను ఆరు నుంచి ఎనిమిదికి పెంచారు. దీంతో శత్రు విమానాలు, ముఖ్యంగా ఇతర స్టెల్త్ ఫైటర్లను గుర్తించే డిటెక్షన్ కెపాసిటీ బాగా పెరిగింది. జె-20ఎస్ ట్విన్-సీట్ వేరియంట్ భవిష్యత్ నెట్‌వర్క్-సెంట్రిక్ వార్‌ఫేర్‌లో సరికొత్త పాత్ర పోషించనుంది. సింగిల్-సీట్ ఫైటర్ల పరిమితులను అధిగమించడానికి దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ముందు సీట్లోని పైలట్ విమానాన్ని నడపడం, డాగ్‌ఫైట్స్ పై దృష్టి పెడతారు.

వెనుక సీట్లోని ఆపరేటర్ ఒక “మిషన్ కోఆర్డినేటర్”గా పనిచేస్తారు. డ్రోన్ల (UAV) సమూహాలను కంట్రోల్ చేయడం, రాడార్ డేటాను విశ్లేషించడం, భూమి లేదా సముద్ర లక్ష్యాలపై స్ట్రైక్ ప్లానింగ్ చేయడం వంటి క్లిష్టమైన బాధ్యతలను నిర్వహిస్తారు.

J-20 ఇప్పుడు కేవలం ఎయిర్-సుపీరియారిటీ ఫైటర్ మాత్రమే కాదు; ఒక సమగ్ర పోరాట వ్యవస్థలో కమాండ్ మరియు కమ్యూనికేషన్ వేదిక. ప్రారంభంలో పరిమితంగా ఉన్న వీటి వినియోగం, ప్రస్తుతం సాధారణ శిక్షణలకే పరిమితం కాకుండా బహుళ యూనిట్లతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు, పోరాట-కేంద్రీకృత టాస్క్‌లు మరియు నిరంతర పెట్రోలింగ్ మిషన్లలో చురుగ్గా పాల్గొంటోంది. ఈ సమగ్ర అప్‌గ్రేడ్లతో జె-20 శ్రేణి గగనతలంలో శత్రువులకు పెను సవాలుగా మారనుంది.

Also Read : ట్రంప్ గేమ్ ఓవర్.. ముందస్తు సర్వేల్లో బిగ్ షాక్.. అమెరికా పొలిటికల్ హీట్ పెంచిన ప్రిడిక్షన్!