తొలకరి పలకరింపుతో ప్రకృతి పులకించిపోయింది.. ఏరువాక పౌర్ణమి వేళ పల్లెల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఆకాశం నిండా కారుమబ్బులు కమ్ముకున్న వేళ, చేతి నిండా వరినారు పట్టుకుని పొలం పనుల్లో నిమగ్నమైన ఇద్దరు బాలికల వీడియో(Village Girls Dance) ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఎటువంటి ఆర్భాటాలు, ఖరీదైన హంగులు లేని ఈ దృశ్యం.. యాంత్రికమైన నగర జీవితంలో మునిగిపోయిన నెటిజన్ల హృదయాలను ఇట్టే ఆకట్టుకుని ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Also Read : ముంబైలో భారీ వర్షం.. 4 విమానాలు రద్దు, 13 దారి మళ్లింపు

చుట్టూ పచ్చని ప్రకృతి.. మట్టి వాసనలు వెదజల్లుతున్న పొలం. అక్కడ ఎలాంటి పెద్ద సెట్టింగులు లేవు.. ఒంటిపై మెరిసే ఖరీదైన దుస్తులు అసలే లేవు. ఇది ఏ డ్యాన్స్ షో కోసమో చేసిన ప్రదర్శన కూడా కాదు. బాలిక తన చేతిలోని వరి నారును పొలంలో నాటుతుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మధురమైన జానపద గీతం “పల్కీ మే హోకే సవార్ చలి రే..” (పల్లకిలో ఊరేగుతూ సాగిందిలే..) వినిపించింది. అంతే.. ఆ శ్రావ్యమైన సంగీతానికి ఆ బాలికలు తమ చేతిలోని పనిని కాసేపు పక్కనబెట్టి, మనస్ఫూర్తిగా చిందులు వేయడం మొదలుపెట్టారు.

ఆనందంతో ముఖంలో స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తూ వారు చేసిన నృత్యం వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. తాము కట్టుకున్న బట్టలకు బురద అంటుకుంటోందన్న విషయాన్ని కూడా వారు అస్సలు లెక్కచేయలేదు. ఆ బురద మట్టిలోనే ప్రకృతితో మమేకమై వారు చేసిన అద్భుతమైన డ్యాన్స్ మూవ్‌మెంట్స్, వారి ముఖాల్లోని అమాయకత్వం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నిజమైన సంతోషం అంటే భారీ ఖర్చుతో కూడిన విలాసాల్లో ఉండదని, ఇలాంటి చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించడంలోనే ఉంటుందని ఈ వీడియో నిరూపిస్తోంది.

Also Read : ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తాం.. మోదీకి బెదిరింపులు!

ఈ వీడియోలో మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. ఆకాశం నిండా నల్లటి మేఘాలు అలుముకుని వర్షం పడేలా ఉండగా, ఆ పక్కనే ఒక చిన్న బాలుడు గొడుగు పట్టుకుని బుడిబుడి అడుగులతో పొలంలో వరినాట్లు వేస్తూ కనిపించడం. ఈ దృశ్యం పల్లెటూరి జీవన విధానాన్ని, అక్కడ ఉండే కల్మషం లేని బాల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆధునిక ప్రపంచపు ఒత్తిడిని ఒక్క క్షణంలో మాయం చేసే శక్తి ఈ వీడియోకు ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురుస్తోంది.

సాధారణంగా రీల్స్, షార్ట్స్ కోసం నగరాల్లో యువత నానా తంటాలు పడుతుంటే.. ఎలాంటి కృత్రిమత్వం లేని ఈ పల్లెటూరి పిల్లల సహజసిద్ధమైన డ్యాన్స్ వీడియోకు లక్షల్లో వ్యూస్, షేర్లు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరాడంబరమైన జీవన శైలిని, ప్రకృతితో కూడిన ఆనందాన్ని ప్రతిబింబిస్తున్న ఈ వీడియో, ప్రతి ఒక్కరిని తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తూ ఇంటర్నెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోగా నిలిచింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.