Porsche :జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ పోర్షేలో మరో 4,000కు పైగా ఉద్యోగాలు తగ్గించే అవకాశం ఉంది. పోర్షేలో ఖర్చులు తగ్గించేందుకు వోక్స్‌వ్యాగన్ కొత్తగా ఈ ఉద్యోగాల కోతను ప్రతిపాదించినట్లు పేర్కొంది. వోక్స్‌వ్యాగన్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పత్రాల్లో పోర్షేలో సుమారు 4,100 ఉద్యోగాలను తగ్గించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా కంపెనీ ఖర్చులను దాదాపు 700 మిలియన్ యూరోలు తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ 4,100 ఉద్యోగాల కోత ఇప్పటికే పోర్షేలో తీసుకున్న నిర్ణయాలకు అదనంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఏడాది జూలైలో పోర్షే యాజమాన్యం, ఉద్యోగుల ప్రతినిధుల మధ్య మరో 5,000 ఉద్యోగాలను తగ్గించేందుకు ఒప్పందం జరిగింది. అంతకుముందు 4,000 ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించారు. ఇప్పుడు మరో 4,100 ఉద్యోగాలు కూడా తగ్గిస్తే.. పోర్షేలో ఉద్యోగాల సంఖ్య మరింత తగ్గనుంది.

2035 నాటికి పోర్షేలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో దాదాపు ఐదో వంతు వరకు తగ్గించే పరిస్థితి ఏర్పడనుంది. అయితే తాజాగా బయటకు వచ్చిన 4,100 ఉద్యోగాల కోతపై వోక్స్‌వ్యాగన్ వెంటనే స్పందించలేదు. మరోవైపు వోక్స్‌వ్యాగన్‌కు పోర్షేలో ఉద్యోగాల కోతను నేరుగా అమలు చేయించే అధికారం లేదు. కంపెనీకి సలహా ఇవ్వడం లేదా సూచించడం మాత్రమే చేయగలదు.

ఇదిలా ఉంటే వోక్స్‌వ్యాగన్‌కు ఈ ఏడాది లాభాలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఈ ఏడాది 4 నుంచి 5.5 శాతం వరకు లాభం వస్తుందని కంపెనీ అంచనా వేసింది. ఇప్పుడు గరిష్ఠంగా 1 శాతం మాత్రమే లాభం రావచ్చని తెలిపింది. పోర్షే పరిస్థితి కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా చైనాలో పోర్షే కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. దీంతో కంపెనీకి పెద్ద దెబ్బ తగిలింది.

అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్ల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవడం కూడా పోర్షేకు ఖర్చు పెంచింది. దీంతో కంపెనీని మళ్లీ గాడిలో పెట్టేందుకు సీఈఓ మైఖేల్ లైటర్స్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లోనే పోర్షేలో ఉద్యోగాల కోతపై మరోసారి వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.