తమిళనాడులోని తేని జిల్లాలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. స్థానిక సబ్‌జైల్ నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు తప్పించుకుని పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి వేళ పక్కా ప్లాన్‌తో ఖైదీలు ఈ ఎస్కేప్ ప్లాన్ అమలు చేశారు.

జైలు అధికారుల వివరాల ప్రకారం.. ఒక సెల్‌లోని ఖైదీలలో ఒకరు తనకు అకస్మాత్తుగా మూర్ఛ (ఫిట్స్) వచ్చినట్లు గట్టిగా నాటకమాడాడు. అది నిజమని నమ్మిన జైలు సిబ్బంది సహాయం చేయడానికి వెంటనే సెల్ డోర్ తెరిచి లోపలికి వెళ్లారు. అదే అదనుగా భావించిన ఖైదీలు ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేసి, అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ దాడిలో గాయపడిన సిబ్బందిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

Also Read : AI ఫొటోతో చావు నాటకం.. మేకను చితిపై పెట్టి అంత్యక్రియలు!

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీస్ శాఖ తేని నుంచి దిండిగల్ వరకు హైఅలర్ట్ ప్రకటించింది. దాదాపు 16 కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. జైలు వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలోకి ఖైదీలు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పరారైన వారిలో ఒకరిని పోలీసులు తిరిగి అరెస్ట్ చేశారు. మిగతా 16 మంది కోసం 17 స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించినట్లు సౌత్‌జోన్ ఐజీ విజయేంద్ర బిడారీ తెలిపారు.

రాష్ట్ర చరిత్రలో 1995 తర్వాత ఈ స్థాయిలో ఖైదీలు తప్పించుకోవడం ఇదే మొదటిసారి. 1995లో వేలూరు కోటలోని స్పెషల్ డిటెన్షన్ సెంటర్ నుంచి LTTEకి చెందిన 43 మంది ఖైదీలు ఏకంగా 153 అడుగుల సొరంగం తవ్వి పారిపోయారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఖైదీలు తప్పించుకోవడంతో పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. ప్రస్తుతం పరారైన మిగతా ఖైదీల కోసం ఫారెస్ట్ ఏరియాతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది.

Also Read : 10 ఏళ్ల బాలిక 6 నెలల గర్భవతి.. కూతురిపై తండ్రి అఘాయిత్యం