
TSHA : తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (TSHA) కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు క్యాష్‌డెస్ట్ వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. హెల్త్‌కేర్ ప్రొవైడర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్‌లో సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, తమ సభ్య ఆసుపత్రులలో క్యాష్‌డెస్ట్ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు సమాచారం అందించినట్లు TSHA వెల్లడించింది.
క్లెయిమ్‌లలో ఏకపక్ష కోతలు విధించడం, అన్యాయంగా క్లెయిమ్‌లను తిరస్కరించడం, సెటిల్‌మెంట్‌లలో జాప్యం చేయడం, ఏకపక్షంగా ఎంపానెల్మెంట్ తొలగించడం, స్పందించని కమ్యూనికేషన్ వంటి నిరంతర సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TSHA పేర్కొంది.
ఈ పరిణామంతో తెలంగాణలోని రోగులకు తక్షణ ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇకపై పాలసీదారులు ఆసుపత్రి బిల్లులను ముందుగా నేరుగా చెల్లించి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఖరీదైన వైద్య చికిత్సలు అవసరమైన కుటుంబాలకు ఇది తీవ్ర ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంది.
అయితే, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సముచితమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటే చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు TSHA సంకేతాలు ఇచ్చింది. దీనిద్వారా శాశ్వతంగా సంబంధాలు తెంచుకోవడం కాకుండా, సంస్థలతో చర్చలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.









