Anti-Paper Leak Bill : పేపర్ లీక్‌ల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చట్టంలో కీలక సవరణలకు సిద్ధమైంది. పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు మరింత కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తీసుకువచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ సవరణలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

కొత్త సవరణల ప్రకారం, పేపర్ లీకులు లేదా పరీక్షల మోసాలకు పాల్పడే వ్యక్తులకు కనీస జైలు శిక్ష ఐదేళ్లకు, గరిష్ట శిక్ష పదేళ్లకు పెరుగుతుంది. అలాగే వ్యక్తులకు విధించే గరిష్ట జరిమానా రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచనున్నారు. పరీక్షల నిర్వహణలో పాలుపంచుకునే సర్వీస్ ప్రొవైడర్లు, ఏజెన్సీలపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. వీరికి విధించే గరిష్ట జరిమానా రూ. 5 కోట్లకు పెంచడంతో పాటు, పరీక్షలు నిర్వహించకుండా నిషేధించే కాలాన్ని ఎనిమిదేళ్లకు పొడిగించారు. అలాగే కంపెనీల్లోని డైరెక్టర్లు, సీనియర్ అధికారులకు కూడా కనీస జైలు శిక్ష ఐదేళ్లు, జరిమానా రూ. 5 కోట్లుగా నిర్ణయించారు.

వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే సిండికేట్లపై మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. వీరికి కనీస జైలు శిక్ష ఏడేళ్లుగా, కనీస జరిమానా ఏకంగా రూ. 10 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు.

విచారణలు, కేసుల విచారణ వేగవంతం చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ సవరణ కోరుతోంది. ఛార్జ్‌షీట్ దాఖలైన మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని, అలాగే పోలీసు విచారణను కూడా రెండు నెలల్లోపే పూర్తి చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసే అధికారాలను కూడా ఈ సవరణ కల్పిస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.