
Karnataka : కర్ణాటకలో ఓ షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల ఏడు వేలకు పైగా విద్యార్థులు, యువతకు హెచ్‌ఐవీ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో హెచ్‌ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ కాలేజీలన్నింటిలోనూ ఈ క్యాంపులు జరగనున్నాయి. అయితే ఏ విద్యార్థిని కూడా వారి ఇష్టం లేకుండా బలవంతంగా పరీక్షలు చేయబోరని, పూర్తిగా వారి అంగీకారంతోనే ఈ టెస్ట్‌లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Also Read : చనిపోయిన రెండేళ్లకు… మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట!
కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ సిఫారసు మేరకు, విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కలిసి ఈ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్రంలో యువతలో హెచ్‌ఐవీ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం, దేశంలో హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది హెచ్‌ఐవీతో జీవిస్తుండగా, కేవలం 2.05 లక్షల మంది మాత్రమే తగిన మందులు తీసుకుంటున్నారు. ఇంకా దాదాపు 54 వేల మందికి తమకు ఈ వ్యాధి సోకిందనే విషయం కూడా తెలియదని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కేఎస్‌ఏపీఎస్ లెక్కల ప్రకారం 18 నుండి 35 సంవత్సరాల వయసు గల వారిలో హెచ్‌ఐవీ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ వయసులో బాధితుల సంఖ్య గడిచిన సంవత్సరాల్లో గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. అందుకే కాలేజీ క్యాంపస్‌లలో విద్యార్థులకు అవగాహన కల్పించి, స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. యువతలో అవగాహన పెంచడం, ఎవరికైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. విద్యార్థులు ఎవరికీ తెలియకుండా రహస్యంగా తమ రిస్క్‌ను చెక్ చేసుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్‌ను కూడా అందుబాటులో ఉంచారు. దీని ద్వారా గోప్యతను పాటిస్తూ తగిన ఆరోగ్య సేవలను పొందవచ్చు.
Also Read : భారత్‌లో నిజంగానే ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అవుతోందా?.. సంచలనం రేపుతున్న వార్తపై అసలు నిజం ఇదే!









