Prajwal Revanna : రేప్ కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల జైలు అధికారుల తనిఖీల్లో రేవణ్ణ సెల్ నుంచి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పరిశీలించగా, అందులో ఏకంగా 80 నుంచి 90 వరకు పోర్నోగ్రఫీ వీడియోలు డౌన్‌లోడ్ చేసి ఉన్నట్లు గుర్తించారని సమాచారం. ప్రముఖ ఖైదీలను లక్ష్యంగా చేసుకుని జైలులో నిర్వహించిన ప్రత్యేక సోదాల్లో ఈ ఫోన్ బయటపడింది.

ఫోన్‌లోని వివరాలను అధికారులు పరిశీలించగా, చాలా వరకు ఇండియన్ పోర్నోగ్రఫీ వీడియోలే ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు అరకొర దుస్తుల్లో ఉన్న మహిళల పేపర్ కటింగ్స్ కూడా లభించాయని పోలీసులు తెలిపారు. ఈ మొబైల్ ఫోన్‌ను ప్రస్తుతం ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. ఆ వీడియోలు ఎప్పుడు, ఎలా డౌన్‌లోడ్ అయ్యాయి? ఆ ఫోన్‌ను ఎవరెవరు వాడారనే పూర్తి డిజిటల్ డేటాను విశ్లేషిస్తున్నారు.

ఈ ఘటన జైలు పరిపాలనపై తీవ్ర దుమారం రేపింది. బాధ్యులైన జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయగా, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సుమారు నాలుగు నుంచి ఐదు గంటల పాటు సాగిన ఈ రిసెర్చ్ లో ఫోన్‌తో పాటు ఒక పెన్‌డ్రైవ్, ఛార్జర్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి తప్ప వేరే ఇతర నిషేధిత వస్తువులేవీ దొరకలేదని స్పష్టం చేశారు.

ఈ దొరికిన వస్తువుల ఆధారంగా అధికారులు కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదే జైలులో ఉంటున్న ప్రతాప్ రాయ్ అనే విచారణ ఖైదీపై కూడా ఈ కేసు మోపారు. రేవణ్ణ వేసుకున్న మధ్యంతర బెయిల్, జైలు శిక్ష నిలిపివేత పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించిన కొద్ది రోజులకే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రేవణ్ణపై ఉన్న తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణలు, కేసుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆయనకు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని, బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

కాగా గత ఏడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టు రేవణ్ణను దోషిగా నిర్ధారిస్తూ, మహిళలపై వరుస లైంగిక దాడులు, సీక్రెట్ వీడియోలు తీయడం, ఆధారాలు వేరే చోట దాచడం వంటి నేరాలకు జీవిత ఖైదు విధించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ వీడియోలు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఆ వీడియోలు ఫేక్ అని రేవణ్ణ మొదటి నుంచీ వాదిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ తీర్పుపై ఆయన వేసిన అప్పీలు హైకోర్టులో ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.