
Mobile Network : ఓ గ్రామంలో రెండేళ్లుగా మొబైల్ నెట్వర్క్ సరిగా రావడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ టెలికాం టెక్నీషియన్‌ను మొబైల్ టవర్‌కు కట్టేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో జరిగింది. అయితే ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫతేపూర్ జిల్లాలోని హర్దౌలి గ్రామానికి టెలికాం టెక్నీషియన్ ఆదిత్యభాన్ సింగ్ వెళ్లాడు. టవర్ వద్ద విద్యుత్ సరఫరాను పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నాడు. అదే సమయంలో కొంతమంది గ్రామస్థులు అతని చుట్టూ చేరి మొబైల్ నెట్వర్క్ సమస్యపై నిలదీశారు. దాదాపు రెండేళ్లుగా నెట్వర్క్ సరిగా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో ఓ గ్రామస్థుడు టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాడు. దీంతో గ్రామస్థులు అతడిని టవర్ కిందకు తీసుకెళ్లి కట్టేశారు. దాదాపు రెండు గంటల పాటు అతడు అక్కడే ఉన్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి తర్వాత మరో విషయం బయటకు వచ్చింది. టెక్నీషియన్ స్వయంగా తనను టవర్‌కు కట్టేయాలని గ్రామస్థులను కోరినట్లు సమాచారం. రెండేళ్లుగా నెట్వర్క్ సమస్యపై కంపెనీకి ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో.. ఇలా చేస్తే తన ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్తుందని అతడు భావించినట్లు తెలుస్తోంది.
Also Read : పుతిన్‌కు మోదీ ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
ఈ ఘటనను ఓ గ్రామస్థుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి విషయం వెళ్లింది. ఓ స్థానికుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 112 హెల్ప్‌లైన్ సిబ్బంది వెంటనే గ్రామానికి చేరుకున్నారు. టవర్ వద్ద ఉన్న టెక్నీషియన్‌ను విడిపించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తన ఫిర్యాదులో ఆదిత్యభాన్ సింగ్ గ్రామానికి వెళ్లగానే నెట్వర్క్ సమస్యపై గ్రామస్థులు తనతో గొడవకు దిగారని చెప్పాడు. ఓ వ్యక్తి తనను టవర్‌కు కట్టేయాలని చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని తెలిపాడు. దాదాపు రెండు గంటల పాటు టవర్ దగ్గర తనను ఉంచారని పోలీసులకు వివరించాడు.
హర్దౌలి గ్రామస్థుల ప్రకారం.. దాదాపు రెండేళ్లుగా గ్రామంలో మొబైల్ నెట్వర్క్ సమస్య ఉంది. ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఇంటర్నెట్ ఉపయోగించడం, ఆన్లైన్ పనులు చేసుకోవడం కూడా ఇబ్బందిగా మారిందని తెలిపారు. ప్రతి నెలా రీచార్జ్‌లకు డబ్బులు ఖర్చు చేస్తున్నా ఉపయోగపడే స్థాయిలో నెట్వర్క్ రావడం లేదని వాపోయారు.దాదాపు రెండేళ్ల క్రితం ఓ ప్రైవేట్ టెలికాం సంస్థ గ్రామంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఇకనైనా నెట్వర్క్ సమస్య తీరుతుందని గ్రామస్థులు భావించారు. కానీ టవర్ ఏర్పాటు చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని వారు చెబుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్యను పట్టించుకునే వారు లేకపోయారని ఆరోపించారు.
తనను టవర్‌కు కట్టేయాలని టెక్నీషియన్ స్వయంగా చెప్పినట్లు వచ్చిన సమాచారం ఇప్పుడు ఈ ఘటనలో ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఫిర్యాదులు చేసినా కంపెనీ స్పందించకపోవడంతో.. ఏదైనా పెద్ద ఘటన జరిగితే ఉన్నతాధికారులు సమస్యను సీరియస్‌గా తీసుకుంటారని అతడు భావించినట్లు తెలుస్తోంది. టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు బింద్కీ పోలీస్ స్టేషన్లో గుర్తుతెలియని గ్రామస్థులపై BNS సెక్షన్ 127(2) కింద కేసు నమోదు చేశారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా ఘటనలో పాల్గొన్న గ్రామస్థులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read : భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్ సమ్మిట్.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..









