జమ్మూ కశ్మీర్‌ శాసనసభలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర హోదాను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం చుట్టూ పెద్ద దుమారమే రేగుతోంది. ఈ తీర్మానానికి వివిధ పార్టీల శాసనసభ్యులు ఏకంగా 10 సవరణలను ప్రతిపాదించడమే కాకుండా.. ఆర్టికల్ 370, 35A లను మళ్లీ తీసుకురావాలని గట్టిగా డిమాండ్ చేస్తుండటంతో అసెంబ్లీ వేదికగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : భారత్‌లో 96 బోయింగ్ విమానాలకు సాఫ్ట్‌వేర్ ముప్పు.. అసలు కాక్‌పిట్‌లో ఏమైంది?

అసలు తీర్మానం ఏమిటి?

సెప్టెంబర్ 25న సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో గతంలో జూన్ 26, 2000, నవంబర్ 6, 2024లలో ఆమోదించిన తీర్మానాలను కూడా ప్రస్తావించారు. ఎలాంటి అధికారాలు లేకుండా, శాంతిభద్రతల బాధ్యతలతో కూడిన పూర్తి స్థాయి రాష్ట్ర హోదానే తమకు కావాలని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల మేరకు, సభలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈ డిమాండ్‌కు మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీ సచివాలయం విడుదల చేసిన ప్రతుల ప్రకారం ఈ తీర్మానానికి 10 మంది ఎమ్మెల్యేలు వేర్వేరు సవరణలను ప్రతిపాదించారు.

జావిద్ హసన్ బేగ్: రాష్ట్ర హోదాతో పాటు ఆర్టికల్ 370, 35A ల కింద లభించే రాజ్యాంగ రక్షణలను చేర్చాలని కోరారు.
నిజాం ఉద్ దిన్ భట్: జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని తీర్మానంలో జోడించాలన్నారు.
ముజఫర్ ఇక్బాల్ ఖాన్: 2019 ఆగస్టు 5 కంటే ముందున్న రాజ్యాంగ, రాజకీయ హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
తన్వీర్ సాదిక్: ఆర్టికల్ 370, 35A రాజ్యాంగ హామీల పట్ల సభ నిబద్ధతను పునరుద్ఘాటించాలని ప్రతిపాదించారు.
అజాజ్ అహ్మద్ జాన్: ఆగస్టు 5, 2019 నాటి పూర్వ స్థితిని పునరుద్ధరించాలని కోరారు.
వహీద్ ఉర్ రెహ్మాన్ పారా: ఆర్టికల్ 370, 35A లతో పాటు స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించాలని సవరణ పెట్టారు.
అగా సయ్యద్ ముంతాజిర్ మెహదీ: 2019లో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంపై ఆవేదన, నిరసనను వ్యక్తం చేయాలన్నారు.
అల్తాఫ్ అహ్మద్ వాని: పూర్వపు రాజ్యాంగ హోదా పునరుద్ధరణే లక్ష్యంగా సవరణ కోరారు.
హిలాల్ అక్బర్ లోన్: నేరుగా ఆర్టికల్ 370, 35A లను పునరుద్ధరించాలని కోరారు.
చౌదరి మహమ్మద్ అక్రమ్: 2019కి ముందున్న రాజ్యాంగ స్థితిని పునరుద్ధరించడానికి నిబద్ధత తెలపాలన్నారు.

తీర్మానంలో 2000 నాటి స్వయంప్రతిపత్తి అంశాన్ని చేర్చడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం రాష్ట్ర హోదా నెపంతో మళ్లీ స్వయంప్రతిపత్తి అంశాన్ని తెరపైకి తెస్తోందని ఆరోపించింది. బీజేపీ ఎమ్మెల్యేలు సభా ముఖ ద్వారంలోకి ప్రవేశించి తీర్మాన ప్రతులను చించివేస్తూ నినాదాలతో హోరెత్తించారు. స్వయంప్రతిపత్తిపై ఎలాంటి చర్చనూ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

Also Read : పసిడి ప్రియులకు ఊరట.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములపై నేడు ఎంత తగ్గిందంటే?