భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో బంగ్లాదేశ్ ఒక భారీ సైనిక ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌‌ను ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్‌కు కేవలం 100 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగ్రాలో ఒక భారీ డ్రోన్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఢాకా ప్లాన్లు వేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక కేవలం బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా.. పాకిస్తాన్, టర్కీ, చైనాల కొత్త కుట్రలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల తర్వాత ఢాకా-ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు మారుతున్నాయి. పాకిస్తాన్‌కు మిత్రదేశమైన టర్కీ రక్షణ రంగంలో విస్తరిస్తోంది. టర్కీ్కు పాకిస్తాన్ మిత్రదేశం. టర్కీ ద్వారా బంగ్లాదేశ్‌‌లోకి ప్రవేశించాలని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్తతలు సృష్టించే చైనా సాంకేతిక సహకారం కూడా ఇందులో ఉండటంతో.. పాకిస్తాన్ నేరుగా రంగంలోకి దిగకుండానే బంగ్లాదేశ్‌ను ముందుపెట్టి భారత్‌పై ఒత్తిడి పెంచే ఇండైరెక్ట్ ప్లాన్ అమలు చేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి.

Also Read : 12 మంది.. దేశవ్యాప్తంగా దుమారం.. కాక్‌రోచ్‌ జనతా పార్టీ కథేంటి?

అయితే ఉత్తర బంగ్లాదేశ్‌లోని బొగ్రా ఎయిర్ బేస్ సమీపంలో టర్కీతో సంయుక్తంగా ఈ డ్రోన్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. మొదటి దశ ప్రారంభంలో టర్కీ సహాయంతో విభిన్న రకాల సైనిక డ్రోన్ల విడిభాగాలను బంగ్లాదేశ్‌లోనే తయారు చేస్తారు. రెండో దశలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర శిక్షణ ద్వారా పెద్ద రకం పోరాట డ్రోన్లను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని బంగ్లాదేశ్ సొంతంగా పెంపొందించుకుంటుంది.

అంతేకాకుండా ఇదే ప్రాంతంలో కొత్త వైమానిక దళ స్థావరం ఏర్పాటుతో పాటు అక్కడి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భారీ డ్రోన్ ప్లాంట్ ప్రాజెక్టును సుమారు రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తయారుచేసే డ్రోన్లను భవిష్యత్తులో ఇండోనేషియా, మలేషియా వంటి ఆసియా దేశాలకు ఎగుమతి చేయాలని కూడా బంగ్లాదేశ్ యోచిస్తోంది.

బంగ్లాదేశ్ ఇప్పటికే టర్కీకి చెందిన ప్రసిద్ధ బైరక్తార్ TB2 డ్రోన్లను ఉపయోగిస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ వద్ద ప్రస్తుతం 12 TB2 డ్రోన్లు ఉన్నాయి. వీటితో పాటు టర్కీ డిఫెన్స్ కంపెనీ రాకెట్సాన్ నుంచి TRG-300 కాప్లాన్ గైడెడ్ రాకెట్ వ్యవస్థను కూడా బంగ్లాదేశ్ కొనుగోలు చేసింది. కేవలం ఆయుధాలను దిగుమతి చేసుకోవడానికే పరిమితం కాకుండా బొగ్రాలో స్వయంగా ఫ్యాక్టరీని నెలకొల్పడం ద్వారా సైనిక పరికరాలను స్థానికంగానే తయారుచేసుకోవడం బంగ్లాదేశ్ ప్రధాన ఉద్దేశం.

అయితే ఈ బొగ్రా ప్రాంతంలో ఈ డ్రోన్ ఫ్యాక్టరీ, వైమానిక దళ స్థావరం ఏర్పాటు కావడం భారతదేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నగరానికి దగ్గరగా ఉండే సిలిగురి కారిడార్ భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. భారత్‌‌ను మిగతా ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఏకైక ఇరుకైన భూమార్గం ఇది. బొగ్రాలో డ్రోన్ స్థావరం ఏర్పడితే ఈ కారిడార్‌‌పై నిరంతరం నిఘా పెట్టే అవకాశం బంగ్లాదేశ్‌తో పాటు పరోక్షంగా చైనా, టర్కీ, పాక్‌కు కూడా దక్కుతుంది. దీంతో భవిష్యత్తులో ఈశాన్య సరిహద్దుల్లో భారత్‌పై పరోక్షంగా భద్రతా ఒత్తిడి పెరుగుతుంది.

Also Read : అమెరికాలో హిందూ ఆలయంపై దాడి.. ఇటుకలతో ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు