బెంగళూరులోని ప్రముఖ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో తీవ్ర వివాదం చెలరేగింది. ప్రతీ ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించే వార్షిక స్నాతకోత్సవ వేడుకలను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయంతో పట్టభద్రులవుతున్న విద్యార్థులకు వేడుక లేకుండానే ‘గైర్హాజరులో’ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. విద్యార్థులు తమ డిగ్రీ సర్టిఫికెట్లను, బంగారు పతకాలను కొరియర్ ద్వారా పొందవచ్చని లేదా క్యాంపస్‌కు వచ్చి స్వయంగా తీసుకోవచ్చని రిజిస్ట్రార్ డాక్టర్ సౌరభ్ భట్టాచార్జీ, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సుధీర్ కృష్ణస్వామి తెలిపారు.

Also Read : ఆ కొన్ని గంటలు మాత్రమే మహర్దశ.. రాఖీ కట్టే పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇవే.. అసలు మిస్ కావద్దు!

Bengaluru National Law School of India University

సాధారణంగా ఎన్ఎల్ఎస్ఐయు స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరవుతుంటారు. అయితే రాబోయే సెప్టెంబర్ 12న జరగాల్సిన వేడుకకు ప్రస్తుత సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాలను ఆహ్వానించడాన్ని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయానికి నిరసనగా సుమారు 165 మంది పట్టభద్రులయ్యే విద్యార్థులు, 409 మంది ప్రస్తుత విద్యార్థులు, 128 మంది పూర్వ విద్యార్థులు కలిసి ఒక బహిరంగ లేఖపై సంతకం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని నల్సార్ లా విశ్వవిద్యాలయం నుంచి ఈ ఏడాది పట్టభద్రులైన విద్యార్థులను ఎన్‌రోల్ చేసుకోవద్దని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు BCI జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత BCI ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నప్పటికీ ఒక ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ విశ్వవిద్యాలయ విద్యార్థులపై ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు రెడీ కావడంతో విద్యార్థులు తప్పుబట్టారు. బీసీఐ ఛైర్మన్ తీరును నిరసిస్తూ ఆయనను స్నాతకోత్సవానికి పిలవకూడదని డిమాండ్ చేశారు.

మరోవైపు ఢిల్లీలో జరిగిన నీట్ నిరసనల సమయంలో పోలీసుల దురాగతాలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని మౌఖిక వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. “దయచేసి మా సమయాన్ని వృధా చేయకండి, ఈ వీడియోలను చూసేందుకు మాకు సమయం లేదు” అని ఆయన వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపై నల్సార్, ఎన్ఎల్ఎస్ఐయు విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ రెండు ప్రధాన కారణాల వల్ల సీజేఐ. బీసీఐ ఛైర్మన్ హాజరయ్యే స్నాతకోత్సవాన్ని బహిష్కరించడానికి విద్యార్థులు రెడీ కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉంచేందుకు యూనివర్సిటీ పాలక మండలి వేడుకలనే పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యున్నత న్యాయ విద్యా సంస్థలో విద్యార్థుల నిరసనల కారణంగా స్నాతకోత్సవం రద్దు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.