
Bihar : బీహార్‌లో నకిలీ డిగ్రీలు, తప్పుడు సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన 3,000 మందికి పైగా ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ స్వయంగా ప్రకటించారు.
ఈ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడానికి ముందు రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో ఒక పెద్ద విచారణ జరిపింది. ముఖ్యంగా 2006 నుండి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాలను అధికారులు పూర్తిగా పరిశీలించారు. ఈ పరిశీలనలో చాలా మంది లేని విద్యాసంస్థల పేరుతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి, తప్పుడు పత్రాలతో మోసపూరితంగా ఉద్యోగాలు సాధించినట్లు తేలింది. ఈ దర్యాప్తు ఆధారంగా తప్పు చేసిన ఉపాధ్యాయులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.
Also Read : మటన్ అని చెప్పి చీప్గా చికెన్ పెడతారా? : పెళ్లిలో రచ్చ రచ్చ.. 12 మందికి గాయాలు!
మోసపూరిత పద్ధతుల్లో ఉద్యోగాలు పొందిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించినట్లు మంత్రి మిథిలేష్ తివారీ విలేకరులకు చెప్పారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకే ఈ విజిలెన్స్ విచారణ జరిగిందని, అవినీతి విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు బీహార్ ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇవ్వవని ఆయన స్పష్టం చేశారు.
తప్పు చేసిన ఉపాధ్యాయులను కేవలం ఉద్యోగాల నుంచి తీసేయడమే కాకుండా, వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, వారు ఉద్యోగంలో ఉన్న కాలంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతాలు, ఇతర అలవెన్సుల డబ్బును వడ్డీతో సహా తిరిగి వసూలు చేస్తామని మంత్రి చెప్పారు. అధికారుల విచారణ మొదలవడానికి ముందే కొందరు ఉపాధ్యాయులు భయపడి రాజీనామాలు చేశారని, అయితే వారిని కూడా వదిలిపెట్టకుండా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Also Read : భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జవసత్వాలు.. దేశ విదేశీ మారక నిల్వల్లొ భారీ వృద్ధి









