Mobile Apps : దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫ్రాడ్ లోన్ యాప్‌లతో సహా మొత్తం 3,718 మొబైల్ యాప్‌లను 2026 జూన్ 30 నాటికి బ్లాక్ చేసినట్లు కేంద్ర హోంశాఖ లోక్‌సభకు తెలిపింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ మోహన్ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఐటీ చట్టంలోని సెక్షన్ 69(ఎ), 79(3)(బి) ప్రకారం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఈ యాప్‌లను అందుబాటులో లేకుండా చేసిందని బండి సంజయ్ తెలిపారు. అలాగే పోలీసు వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఇప్పటివరకు 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులను, 5.77 లక్షలకు పైగా ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేసిందని వివరించారు.

Also Read : రాజ్యసభలో లుంగీవాలా రచ్చ: దక్షిణాది ఎంపీల తీవ్ర నిరసన!

సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా వచ్చిన 32.80 లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించి, బాధితులకు చెందిన రూ. 11,158 కోట్లకు పైగా డబ్బులు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినట్లుగా మంత్రి తెలిపారు. సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని సేకరించేందుకు 2024 సెప్టెంబర్ 10న బ్యాంకులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో సస్పెక్ట్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ డేటా ఆధారంగా దాదాపు రూ. 25,698 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకులు రిజెక్ట్ చేశాయని పేర్కొన్నారు.

సైబర్ ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసేందుకు, మోసపోయిన డబ్బులను బాధితులకు త్వరగా తిరిగి ఇచ్చేందుకు వీలుగా 2026 ఏప్రిల్ నుంచి మనీ రీస్టోరేషన్ మోడ్యూల్, గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మోడ్యూల్ లను అందుబాటులోకి తెచ్చినట్లు బండి సంజయ్ వెల్లడించారు. సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైబర్ దోస్త్, ఐపీఎల్ ప్రచారాలు, సెలబ్రిటీలతో ప్రకటనలు, టీవీ, రేడియో, ఎస్ఎంఎస్ల ద్వారా భారీగా ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు.

Also Read : ప్యాకింగ్‌ మారాల్సిందే.. పాన్‌ మసాలాపై FSSAI సంచలన నిర్ణయం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.