
CM Vijay : తమిళనాడులో మదురాంతకం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కింది. సీఎం విజయ్ మదురాంతకంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడీఎంకే ఇప్పుడు డీఎంకేకు ఓ బ్రాంచ్‌గా మారిపోయిందని ఆరోపించారు. అసెంబ్లీలో అవినీతి గురించి మాట్లాడితే డీఎంకే నేతలు వెంటనే కోపం తెచ్చుకుంటున్నారని విజయ్ అన్నారు. అవినీతిపై మాట్లాడిన ప్రతిసారీ ఆధారాలు అడుగుతున్నారని, తనను అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు.
అవినీతిపై తాను చేస్తున్న విమర్శలను డీఎంకే నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని విజయ్ అన్నారు. గతంలో జరిగిన అవినీతిపై కూడా ప్రశ్నిస్తామని చెప్పారు. తాను ఎలాంటి ఒత్తిడికీ భయపడబోనని పేర్కొన్నారు. డీఎంకే ఇకపై అవినీతికి పాల్పడబోమని హామీ ఇవ్వగలదా అని విజయ్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీని స్వచ్ఛమైన శక్తిగా, డీఎంకేను చెడు శక్తిగా ఆయన అభివర్ణించారు.
మదురాంతకం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా కాకుండా వారిలో ఒకరిగా, వారి సోదరుడిగా ఇక్కడికి వచ్చానని విజయ్ అన్నారు. సామాన్య ప్రజల పార్టీగా TVK అధికారంలోకి ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. తనను సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ ఆదరించింది ప్రజలేనని చెప్పారు. ఇటీవల చర్చకు వచ్చిన వీరమణి POCSO కేసును కూడా విజయ్ ప్రస్తావించారు. ఈ కేసులో నిజాన్ని ఎంతకాలం దాచగలరని ప్రశ్నించారు. డబ్బు, అధికారంతో చిన్నారులపై జరిగిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. చిన్నారులు, మహిళలపై నేరాలకు పాల్పడిన వారు ఎంత ప్రభావవంతమైన వ్యక్తులైనా చట్టం నుంచి తప్పించుకోలేరని విజయ్ అన్నారు. నేరానికి పాల్పడిన వారితో పాటు, ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళలు, పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియా, మీడియా వేదికల్లో ప్రచారం చేయడంపై కూడా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ఇతర వివరాల ప్రసారంపై న్యాయపరమైన చర్యలు కోరుతూ బాలల హక్కుల సంస్థ కోర్టును ఆశ్రయించింది. కాగామదురాంతకం నుంచి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున గెలిచిన కె. మరగతం కుమారవేల్ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి TVKలో చేరారు. దీంతో మదురాంతకం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఆమెనే TVK అభ్యర్థిగా బరిలోకి దింపింది. అక్టోబర్ 6న ఉప ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.









