
CNG Car Blast : గుజరాత్‌లోని వడోదర జిల్లా కర్జన్ సమీపంలో భారీ ప్రమాదం జరిగింది. CNG పంప్ వద్ద గ్యాస్ నింపుతుండగా ఓ CNG కారు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి CCTV కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో కనీసం ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరో కారు కూడా భారీగా దెబ్బతింది.
CNG పంప్ వద్ద తెల్ల రంగులో ఉన్న రెనాల్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుకు గ్యాస్ నింపుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి ఓ సెడాన్ కారు వచ్చి దాని వెనుక ఆగింది. సెడాన్ కారు డ్రైవర్ వాహనం నుంచి బయటకు వచ్చి డోర్ మూసి కొన్ని అడుగులు ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత కేవలం కొన్ని సెకన్లలోనే CNG కారులో భారీ పేలుడు జరిగింది.
Also Read : 12 మంది.. దేశవ్యాప్తంగా దుమారం.. కాక్రోచ్ జనతా పార్టీ కథేంటి?
పేలుడు ధాటికి CNG కారులోని భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గ్యాస్ నింపుతున్న పైపు కూడా తెగిపోయింది. పేలుడు ప్రభావంతో వెనుక ఉన్న సెడాన్ కారు కూడా తీవ్రంగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన సమయంలో CNG కారు డ్రైవర్ అందులో లేడు. వెనుక ఉన్న కారులోని డ్రైవర్ కూడా పేలుడుకు కొద్దిసేపటి ముందే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.
CCTVలో పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. పంప్ సిబ్బంది, అక్కడ ఉన్న వాహనదారులు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటన అక్టోబర్ 1న జరగగా.. దీనికి సంబంధించిన CCTV వీడియో శనివారం బయటకు వచ్చింది. కర్జన్-నేషనల్ హైవే-48పై ఉన్న CNG పంప్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి CNG ట్యాంక్‌లోని ఒక భాగం పంప్‌పై పడింది. మరో భాగం గాల్లోకి ఎగిరి చాలా దూరంలో పడిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం CNG లీక్ ఎలా జరిగింది? గ్యాస్ ఎక్కడి నుంచి లీకైంది? అసలు CNG ట్యాంక్ ఎందుకు పేలింది? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది.
Also Read : జేబులో రూపాయి లేకుండానే బిజినెస్.. గవర్నమెంట్ పోర్టల్‌తో క్షణాల్లో లోన్.. ఎలాగంటే?









