
Colgate-Palmolive : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తలు ఇటీవల గ్యాస్, పెట్రోల్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఈ విషయం మరువకముందే మరో నిత్యవసర వస్తువుపై యుద్ధం ఎఫెక్ట్ పడింది. యుద్ధం కారణంగా ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో తమ లాభాల శాతాన్ని కాపాడుకు నేందుకు రాబోయే త్రైమాసికాలంలో ఉత్పత్తుల ధరలను మరింత పెంచే యోచనలో కొల్గేట్-పామోలివ్ ఇండియా ఉన్నట్లు తెలుస్తోంది. తమ కంపెనీ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు ఈ ధరల పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని కంపెనీ పేర్కొన్నట్లుగా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Also Read : జాతీయ క్రీడా పురస్కారాలు-2025 ప్రకటన.. 17 మందికి అర్జున అవార్డులు
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ద్రవ్యోల్బణం ఇప్పటికీ ప్రధాన సమస్యగా మారినప్పటికీ, సాధారణ వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించేందుకు కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని కోల్గేట్ వివరించింది. గత ఏడాది జీఎస్టీ సవరణల వల్ల చిన్న ప్యాకెట్ల పరిమాణం పెంచడం ద్వారా వినియోగదారులకు అందించామని సంస్థ తెలిపింది, ఆ అదనపు పరిమాణాన్ని రూ. 10, రూ. 20 ప్యాకెట్లలో ఇప్పటికీ కొనసాగిస్తున్నామని కంపెనీ సీఈఓ, ఎండీ ప్రభా నరసింహన్ వార్షిక ఇన్వెస్టర్ల సమావేశంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇటీవల తక్కువ స్థాయిలో ధరల పెంపు చేపట్టినప్పటికీ, సామాన్య వినియోగదారులకు భద్రత కల్పించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ఆమె వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం మూలంగా ముడి సరుకుల సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇప్పుడు ధరలు పెంచకపోతే భవిష్యత్తులో ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు ఇన్ పుట్ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, ప్రీమియం కేటగిరీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోందని ఆమె వెల్లడించింది. టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్ విభాగాల్లో ప్రీమియం ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ఆదరణ ఉందనే అభిప్రాయాన్ని కంపెనీ వ్యక్తం చేస్తోంది. హిందూస్థాన్ యూనిలీవర్ (పెప్సోడెంట్, క్లోజప్), హేలియాన్ (సెన్సోడైన్), పతంజలి వంటి సంస్థలతో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, వాల్యూమ్ గ్రోత్ కోసం తమ కోర్ బ్రాండ్లను బలోపేతం చేయడంతో పాటు ప్యాకేజింగ్, ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచాలని సంస్థ యోచిస్తోంది. మరోవైపు, కోల్గేట్-పామోలివ్‌కు చెందిన పర్సనల్ కేర్ బ్రాండ్ పామోలివ్ మార్కెట్ పనితీరుపై ప్రభా నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. కంపెనీ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు బాంబే షేవింగ్ కంపెనీతో జత కట్టినట్లు తెలిపారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన లభ్యత, ఆదాయాల పెరుగుదల, నోటి ఆరోగ్యంపై అవగాహన పెరగడం వలన గ్రామీణ మార్కెట్లలో విక్రయాలు పుంజుకుంటున్నప్పటికీ, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల ఏర్పడే పరిణామాలపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
Also Read : జార్ఖండ్‌లో ఉధృతమైన విద్యార్థుల ఆందోళన…20 న సీఎం ఇంటి ముట్టడికి పిలుపు









