
Netaji Subhash Chandra Bose : స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికల వివాదం కీలక మలపు తిరిగింది. ఆయనకు సంబంధించిన అస్థికలు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్నాయని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. కాగా ఈ విషయమై సుప్రీం కోర్టు ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలను ఇండియాకు తీసుకువచ్చే విషయంపై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన తన తండ్రి అస్తికలను మనదేశానికి తీసుకువచ్చి ఆయనకు ఘనంగా నివాళి అర్పించాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ ప్లాఫ్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు నోటీసులు జారీ చేసింది.
రెంకోజీ ఆలయంలో ఉన్న అస్తికలను మన మాతృదేశానికి తరలించి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె కోరారు. కాగా ఈ రోజు (ఆగస్టు 11) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నేతాజీ అస్థికలను ఇండియాకు తీసుకువచ్చే విషయంపై కేంద్రం స్పందించాలని తన తీర్పులో ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
కాగా, భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఆయన మరణం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. బోస్ మరణానికి దారితీసిన పరిస్థితులు నేటికి చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే బోస్ మరణానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. దీంతో ప్రభుత్వాలు షా నవాజ్ కమిటీ, జస్టిస్ జి.డి. ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్‌లతో సహా సంవత్సరాలుగా వివిధ విచారణలు జరిపించాయి.
షా నవాజ్ కమిటీ, జస్టిస్ జి.డి. ఖోస్లా కమిషన్ 1945 విమాన ప్రమాదంలో బోస్ మరణించారని నిర్ధారించాయి. అయితే 2005లో తన నివేదికను సమర్పించిన ముఖర్జీ కమిషన్ మాత్రం విమాన ప్రమాద విషయాన్ని తిరస్కరించింది. కానీ నాటి ప్రభుత్వం ముఖర్జీ కమిషన్ నిర్ధారణలను అంగీకరించలేదు. వివిధ విచారణల నివేదికలను పరిశీలించిన తర్వాత 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని భారత ప్రభుత్వం భావిస్తూ వస్తోంది.
అయితే 1945 ఆగస్టు 18న తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని, ఆ తర్వాత ఆయన భౌతిక కాయానికి సంబంధించిన బూడిదను జపాన్‌లోని రెంకోజీ ఆలయానికి చేర్చారని చాలామంది నమ్ముతున్నారు. దీంతో భారతదేశం నుండి టోక్యో వెళ్లే అనేక మంది ప్రముఖులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి నేతాజీకి నివాళులు అర్పిస్తుంటారు.









