ఢిల్లీలో పొల్యూషన్ రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తోడు వాహనాలు ఎక్కువగా తిరగడం వల్ల వాయు పొల్యూషన్ అధికం అవుతోంది. ఈ క్రమంలో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత భారీగా తగ్గడంతో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మొదటి దశను అక్టోబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గాలి నాణ్యత పరిస్థితి, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటారు. అయితే అక్టోబర్ 20న కేటగిరీలో 179గా ఢిల్లీ గాలి నాణ్యత సూచిక ఉంది. అదే అక్టోబర్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు 244కు పదునుగా పెరిగిందని CAQM తెలిపింది. రాబోయే రోజుల్లో ఏక్యూఐ పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ క్రమంలోనే కొన్ని ఆదేశాలను జారీ చేసింది.

Also Read : భారత్‌లో అల్లర్లకు అంతర్జాతీయంగా కుట్ర? 9 దేశాల్లో 101 నెట్‌వర్క్‌లు

GRAP అంటే ఏమిటి?

ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత అది మరింత క్షీణించకుండా నివారించడానికి అమలులోకి వచ్చే అత్యవసర చర్యల సముదాయమే గ్రాప్ (GRAP). డిసెంబర్ 2016లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2017 జనవరి 12న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)ను నోటిఫై చేసి దాని అమలు బాధ్యతను పర్యావరణ కాలుష్య అథారిటీకి అప్పగించింది. ఈ ప్రణాళిక ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వివిధ స్థాయిల వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి గ్రేడెడ్ చర్యలను ఏర్పాటు చేసింది.

GRAP అనేది క్రమక్రమంగా జరిగే ప్రక్రియ. కాబట్టి గాలి నాణ్యత స్థాయి తగ్గినప్పుడు కొన్ని చర్యలను తప్పకుండా పాటించాలి. గాలి నాణ్యత సూచిక (AQI) 201 నుండి 300 మధ్య ఉండి.. గాలి నాణ్యత చెత్తగా తయారైనప్పుడు కాలుష్యాన్ని అదుపు చేయడానికి GRAP (గ్రాప్) మొదటి దశ నియమాలు అమల్లోకి వస్తాయి. గాలి నాణ్యత సూచిక 301 నుంచి 400 మధ్యలో ఉన్నప్పుడు రెండవ దశను ప్రారంభిస్తారు. ఇక గాలి నాణ్యత సూచిక 401 నుంచి 450 మధ్యలో ఉన్నప్పుడు మూడవ దశను స్టార్ట్ చేస్తారు. గాలి నాణ్యత సూచిక 450 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు నాల్గవ దశను ప్రారంభిస్తారు. అయితే GRAP మొదటి దశ కింద దుమ్ము నివారణ చర్యలను బలోపేతం చేయనున్నారు. అలాగే నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలు, వ్యర్థాల నిర్వహణ, ఇతర కాలుష్య వనరులకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో వాహన ఉద్గారాలు, డీజిల్ జనరేటర్ సెట్లు, ప్రజా రవాణా, పారిశ్రామిక ఉద్గారాలు, తందూర్‌లో బొగ్గు, కట్టెల వాడకానికి సంబంధించిన చర్యలు కూడా ఉంటాయి.

అలాగే ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు సిగ్నళ్లను ఒకదానికొకటి అనుసంధానించాలి. అదేవిధంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రహదారుల వద్ద తగినంత మంది ట్రాఫిక్ పోలీసులను అందుబాటులో ఉంచాలి. వాహనాల కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. పొగ విపరీతంగా చిమ్ముతూ రోడ్లపై తిరిగే వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకోవడం లేదా వాటికి భారీ జరిమానాలు విధించడం వంటివి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థానాల ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువు దాటిన పాత డీజిల్ పెట్రోల్ వాహనాలు రోడ్లపై తిరగకుండా ఆంక్షలను ఖచ్చితంగా అమలు చేయాలి.

Also Read : జియో సంచలనం.. ఐపీఓ మొదలైన కొన్ని నిమిషాల్లోనే వంద శాతం సబ్‌స్క్రిప్షన్.. స్టాక్ మార్కెట్‌లో రికార్డ్!