
Delhi : ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. మొత్తం కేసుల సంఖ్య 2,300 దాటడంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి కేసులు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీలో నమోదైన కేసులతో పాటు, సుమారు 650 ఫ్లూ కేసులు కూడా వెలుగు చూశాయి. కోవిడ్ సమయంలో పాటించిన కొన్ని జాగ్రత్తలను ప్రజలు మళ్లీ పాటించాలని ప్రభుత్వం సూచించింది. అయితే మాస్కులు ధరించడంపై మాత్రం ఎలాంటి ప్రత్యేక నిబంధన పెట్టలేదు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పబ్లిక్ అడ్వైజరీ ద్వారా కోరారు.
Also Read : అమెజాన్, బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టామార్ట్‌లకు బిగ్ షాక్.. ఫుడ్ లైసెన్సులు రద్దు.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ ఆరోగ్య శాఖ ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ స్పష్టం చేశారు. ఆసుపత్రులలో తగినన్ని బెడ్లు, డాక్టర్లు, మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
ఎన్డీఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. హెచ్1ఎన్1 వేరియంట్లతో కలిపి సుమారు 3,000 మంది రోగులు ఆసుపత్రులకు రాగా, వారందరూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం 2,308 స్వైన్ ఫ్లూ కేసులు ఉండగా, మరో వేరియంట్‌కు సంబంధించినవి 600 నుంచి 650 వరకు ఉన్నాయని తెలిపారు. అలాగే తాజాగా 2,200 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, ఎవరూ సీరియస్ కండిషన్లో లేరని, ఐసీయూ లేదా వెంటిలేటర్లపై ఎవరూ లేరని తెలిపారు. సాధారణ జ్వరంతో వస్తున్న రోగులు చికిత్స తీసుకొని త్వరగానే కోలుకుంటున్నారని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత భారతదేశంలో నిఘా వ్యవస్థ చాలా బలపడిందని ఐసీఎంఆర్ , డైరెక్టర్ రాజీవ్ వివరించారు. దేశంలో ఏయే వైరస్లు తిరుగుతున్నాయో రియల్ టైమ్‌లో తెలుసుకునే శక్తి మనకు వచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికలు, ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా నిఘా కొనసాగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 73 ల్యాబ్‌లు ఈ పర్యవేక్షణలో భాగస్వామ్యం అయ్యాయని, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో వచ్చే కేసుల్లో ప్రతి వారం 25 నమూనాలను సేకరించి అన్ని రకాల వైరస్‌లపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read : నెలకు రూ.10 వేలతో కోటి రూపాయలు.. ఎలాగో మీకు తెలుసా?









