Rohullah Mehdi : బాలీవుడ్‌ లో ఓ నటుడి వద్ద డ్రగ్స్‌ లభ్యమవడం కలకలం రేపింది. పక్కా సమాచారంతో పోలీసులు నటుడు రోహుల్లా మెహదీను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన వద్ద నుంచి సుమారు రూ. 5.60 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన స్నాప్‌చాట్, వాట్సాప్‌‌ తదితర మాధ్యమాల ద్వారా ముంబైలో ఓ పెద్ద డ్రగ్స్ నెట్‌వర్క్ నడుస్తోందని పోలీసులకు నమ్మకమైన సమాచారం అందింది. దీంతో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు భారీ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.

అందులో భాగంగా ఓ పోలీసు అధికారి కస్టమర్‌లా అవతారం ఎత్తి డ్రగ్స్ డీలర్లను సంప్రదించాడు. కాగా, కాసిఫ్ అనే వ్యక్తి దహిసర్ చెక్ నాకా సమీపంలోని ఠాకూర్ మాల్ వద్దకు 28 గ్రాముల ఎండీ డ్రగ్స్ తీసుకుని దాన్ని డెలివరీ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో డ్రగ్స్ డీల్ జరుగుతుండగా పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన కాసిఫ్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. ఈ డ్రగ్స్ వ్యవహారంలో నటుడు రోహుల్లా మెహదీ ప్రమేయం ఉందని విషయం వెలుగు చూసింది.

కాసిఫ్ ఇచ్చిన సమాచారంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం ముంబై మలద్‌లోని షూటింగ్‌లో ఉన్న సమయంలో పోలీసులు రోహుల్లా మెహదీని అరెస్ట్ చేశారు. అనంతరం మెహదీని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతడికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కాగా, ఈ నెట్‌వర్క్‌లో బాలీవుడ్‌కు చెందిన ఇతర నటులు, వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో డీసీపీ రాహుల్ చవాన్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.