
దేశంలో డిజిటల్ చెల్లింపులు యూపీఐ (UPI) లావాదేవీలపై త్వరలో అదనపు ఛార్జీలు అమలులోకి రానున్నాయి. అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనలు ఇంకా అమల్లోకి రాకముందే దేశంలోని పలు ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులకు వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా పెట్రోల్ పంపులు, సీఎన్జీ స్టేషన్లు, కొన్ని వ్యాపార సముదాయాలు యూపీఐ చెల్లింపులను పరిమితం చేయడం లేదా పూర్తిగా తిరస్కరించడం చేస్తుండటంతో సామాన్య వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, పాట్నా వంటి నగరాల్లో పలు పెట్రోల్ పంపులు, వ్యాపార సంస్థలు రూ. 2 వేలు దాటితే యూపీఐ స్వీకరించమనే బోర్డులను ఏర్పాటు చేశాయి. వినియోగదారులను డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా నేరుగా నగదు చెల్లించాలని కోరుతున్నాయి. మధ్యప్రదేశ్లో సుమారు 5,000 పెట్రోల్ పంపులలో ఈ నిర్ణయం అమలవుతోంది. మరోవైపు కొన్ని చోట్ల క్యూఆర్ కోడ్లను తొలగించడం, చెల్లింపు విధానాన్ని బట్టి వేర్వేరు ధరలను వసూలు చేయడం వంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో 6.5 కోట్లకు పైగా వ్యాపారులు, 57 కోట్ల క్యూఆర్ కోడ్ల ద్వారా యూపీఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఓ సర్వే ప్రకారం 41 శాతం మంది వ్యాపారులు ప్రతిపాదిత 0.4 శాతం అదనపు ఛార్జీని తమ సొంత జేబు నుంచి భరించడానికి సిద్ధంగా లేరు. కేవలం 17 శాతం మంది మాత్రమే దీనికి అంగీకరించారు. వ్యాపారులపై ఈ అదనపు భారం పడటంతో వారు డిజిటల్ చెల్లింపులను నిలిపివేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది నిత్యం యూపీఐపైనే ఆధారపడే 65 శాతం మంది సాధారణ వినియోగదారులకు ఇబ్బంది కలగనుంది.
గత కొన్నేళ్లుగా యూపీఐ వినియోగం పెరగడంతో ప్రజలు ఏటీఎంలకు వెళ్లడం, జేబులో నగదు ఉంచుకోవడం బాగా తగ్గించారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2024 నుంచి 2026 మధ్య దేశంలో దాదాపు 9 వేలు ఏటీఎంలు మూతపడగా.. నగదు ఉపసంహరణలు 20 శాతం తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చే ఛార్జీల వల్ల వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు నిలిపివేస్తే ప్రజలు తప్పనిసరిగా మళ్లీ ఏటీఎంలు, చేతిలో నగదు ఉంచుకునే పాత రోజులకు మళ్లక తప్పదని నిపుణులు భావిస్తున్నారు.









